హైదరాబాద్ జంట పేలుళ్ల కేసు...ఇద్దరు దోషులకు ఉరి శిక్ష ఖరారు!

Edari Rama Krishna

పదకొండేళ్ల కిందట అంటే 2007 ఆగష్టు 25న హైదరాబాద్ లో జరిగిన జంట పేలుళ్లు తీవ్ర కలకలం రేపాయి. లుంబినీ పార్క్, గోకుల్ ఛాట్ పేలుళ్ల కేసును విచారిస్తున్న నాంపల్లి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తుది తీర్పును వాయిదా వేసింది. చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉన్న నిందితులను న్యాయస్థానం ప్రత్యేకంగా విచారించింది. ఈ విచారణ అనంతరం సెప్టెంబర్ 4వ తేదికి తీర్పును వాయిదా వేసింది కోర్టు, మంగళవారం రోజున ఇద్దరు నిందితులను దోషులుగా మరో ఇద్దరు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు చెప్పిన సంగతి అందరికి తెలిసిందే.. తాజాగా హైదరాబాద్ లోని లుంబీనీ పార్క్, గోకుల్ చాట్ బాంబు పేలుళ్ల కేసులో నాంపల్లి ప్రత్యేక కోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించింది. 


ఈ ఘటనలో బాంబులు అమర్చిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు అనిఖ్ షఫీఖ్ సయ్యద్, అక్బర్ ఇస్మాయిల్ లకు ఉరి శిక్ష విధిస్తూ న్యాయస్థానం ఈరోజు తీర్పు ఇచ్చింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన తారీఖ్ అంజుమ్ కు యావజ్జీవ శిక్ష విధిస్తున్నట్టు ప్రత్యేక కోర్టు తీర్పు నిచ్చింది.  కాగా, 2007 ఆగష్టు 25న రాత్రి 7 గంటల 45 నిమిషాలకు ట్యాంక్ బండ్ లోని లుంబిని పార్క్ లో హైదరాబాద్ చరిత్ర, విశిష్టతలను వివరిస్తూ లేజర్ షో జరుగుతోంది.


అక్కడి వచ్చిన ప్రేక్షకులు ఆసక్తిగా వింటున్నారు. కొన్ని క్షణాల్లోనే పెద్ద శబ్దంతో బాంబు పేలింది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరికొన్ని నిమిషాల్లోనే కోఠిలోని గోకుల్ ఛాట్ వద్ద జరిగిన పేలుడులో 33 మంది చనిపోయారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై మరో 19 బాంబులను గుర్తించి నిర్వీర్యం చేశారు. ఈ ఘటనలో 44 మంది ప్రాణాలు కోల్పోగా, 68 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో అక్బర్ ఏ1, అనిఖ్ ఏ2 ముద్దాయిలుగా ఉన్నారు. ఈ నెల 4న వీరిని దోషులుగా కోర్టు ప్రకటించింది. ఈ కేసు విచారణ సుమారు పదకొండేళ్ల పాటు జరిగింది. ఈ కేసుకు సంబంధించి సాదిక్, ఫారూఖ్ లను నిర్దోషులుగా కోర్టు ఇప్పటికే ప్రకటించింది. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారులు భత్కల్ సోదరులు పరారీలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: