శాసనసభరద్ధుపై ప్రముఖుల వ్యాఖ్యలు - పోయేకాలమే - ఆపద్దర్మ సిఎంగా కూడా పనికిరారు

కాంగ్రెస్‌ గెలుపు ఎవరూ ఆపలేరు: కాంగ్రెస్‌ మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి  

కేసీఆర్‌ ప్రకటించిన అభ్యర్థుల్లో సగం మందికి పైగా డిపాజిట్‌ కూడా రాదని కాంగ్రెస్‌ మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన చూస్తే ఇక కాంగ్రెస్‌ గెలుపు ఎవరూ ఆపలేరని అర్థమవుతుందన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ, అభ్యర్థుల జాబితాతో సీఎం సెల్ఫ్‌ గోల్‌ చేసుకున్నారని విమర్శించారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయని అందుకు కేసీఆర్‌ ప్రకటించిన అభ్యర్థుల జాబితానే నిదర్శనమన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ జాగ్రత్తగా అభ్యర్థులను ఎంపిక చేస్తే 100సీట్లు రావడం ఖాయమని దీమావ్యక్తం చేశారు. గెలిచే అభ్యర్థులకోసం పార్టీల్లో కొట్లాడుతానని కోమటిరెడ్డి పేర్కొన్నారు.

కొడుకును సీఎం చేయడం కోసమే కేసీఆర్‌ ముందస్తు : వీహెచ్‌ 

కేటీఆర్‌ ను ముఖ్యమంత్రి చేయడం కోసమే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హన్మంతరావు ఆరోపించారు. నిజామాబాద్‌లోని కల్లూరు గ్రామంలో ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి సోనియా గాంధీకి అప్పజెప్పడమే తన లక్ష్యమన్నారు.

కల్లూరు గ్రామం నుంచి మట్టిని తెచ్చి గాంధీ భవన్‌లో పెడతా. కేసీఆర్‌ను గద్దెదించి కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే అదే గ్రామంలో చల్లుతా నని శపధం చేశారు. ఎన్నికల మేనిపెస్ట్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.  

కేసీఆర్‌  తన ఓటమిని తానే ఒప్పుకున్నారు: కాంగ్రెస్ ఇన్-చార్జ్ కుంతియా 

ఐదేళ్లు పరిపాలించమని ప్రజలు తీర్పునిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అర్థాంతరంగా ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ కుంతియా  తీవ్రస్థాయిలో విమర్శించారు. కేసీఆర్ ప్రకటనపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ ది నియంతృత్వ ధోరణి అని అంటూ, ముందస్తుకు వెళ్తున్నానని ప్రకటించిన కేసీఆర్‌,  తన ఓటమిని తానే ఒప్పుకున్నారని కుంతియా అన్నారు.


ఎవరి కోసం ఈ ముందస్తు ఎన్నికలని, కేసీఆర్‌ కుటుంబం కోసమా? తెలంగాణ ప్రజల కోసమా? అంటూ ఆయన ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికలు వస్తే కోడ్‌ అమలులో ఉంటుందని, కొత్త పనులు ఏమీ జరగవని కుంతియా అన్నారు. తెలంగాణలో ఎన్నికలయ్యాక, నరెంద్ర మోదీ ఎన్నికలకు వెళ్తారని, అప్పుడు మళ్లీ ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తుందని, దీంతో తెలంగాణ ప్రజలకు ఒక ఏడాది పాటు అభివృద్ది కుంటుపడుతుందని తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని కుంతియా అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తే 13లక్షల మంది ఓటు హక్కు కోల్పోరని అన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఒప్పందం ప్రకారమే ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని, ఎన్నికలకు కాంగ్రెస్ భయపడటం లేదని కుంతియా స్పష్టం చేశారు. 

చేతగాని కేసీఆర్‌ కి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవెందుకు? : కోదండరామ్‌ 

అసెంబ్లీ‌ రద్దు చేసి కేసీఆర్‌ తన చేతకానితనాన్ని బయటపెట్టుకున్నారని కోదండరామ్‌ విమర్శించారు. గవర్నర్‌ను కలిసి కేసీఆర్‌ ను ఆపధర్మ సీఎంగా తొలగించాలని కోరతామని, తెలంగాణ లో రాష్ట్రపతి పాలన విధించాలని కోదండరామ్‌ తెలిపారు. మంచి పాలన చేసే ముఖ్యమంత్రి అసెంబ్లీని రద్దు చేయరని కోదండరామ్‌ అన్నారు.


కేసీఆర్‌ అనేక సార్లు అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని కోదండరామ్ మండి పడ్డారు. కేసీఆర్‌ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగించటం సరికాదన్నారు. త్వరలో తెలంగాణ జన సమితి అభ్యర్థులను‌ ప్రకటిస్తామని కోదండరామ్‌ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: