‘కన్నా’కే బీజేపీ అధ్యక్ష పగ్గాలు...! సీనియర్లు సహకరిస్తారా..?

Vasishta

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనేదానిపై ఉత్కంఠ తొలగిపోయింది. కంభంపాటి హరిబాబు రాజీనామా తర్వాత ఆ పదవిని ఎవరికి కట్టబెట్టబోతున్నారనేదానిపై నెలకొన్న సస్పెన్స్ ను బీజేపీ అధిష్టానం తెరదించింది. కన్నా లక్ష్మినారాయణను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా. ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ గా సోము వీర్రాజులను నియమించింది. .


          బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఏప్రిల్ 16వ తేదీన రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఈ పదవిని ఎవరిని చేపట్టబోతోరోననే ఉత్కంఠ నెలకొంది. టీడీపీ-బీజేపీ మధ్య సంబంధాలు తెగిపోయిన నేపథ్యంలో కమలదళాన్ని సమర్థవంతంగా నడిపించగల నాయకుడికోసం ఆ పార్టీ అధిష్టానం తీవ్ర కసరత్తే చేసింది. సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలందిస్తున్న మాజీ మంత్రి మాణిక్యాలరావుకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం భావించినా, ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. దూకుడు ప్రదర్శించే ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు ఆ బాధ్యతలు అప్పజెప్పాలని ఆయన అధిష్టానానికి సూచించారు.


          అయితే.. సోము వీర్రాజుకు పార్టీ పగ్గాలు ఇవ్వడానికి బీజేపీ అధిష్టానం సుముఖంగా లేదు. ఆయన దూకుడు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు తెస్తుందని భావించిన బీజేపీ పెద్దలు ఆయన సేవలను మరో రకంగా ఉపయోగించుకోవాలని భావించారు. ప్రస్తుతం ఆయనకు ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ బాధ్యతలను అప్పగించారు.


          రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన కన్నా లక్ష్మినారాయణకు అనూహ్యంగా అధ్యక్ష పదవి దక్కింది. బీజేపీలో సరైన గుర్తింపు లేదని భావించి కొన్ని రోజుల క్రితమే వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు కన్నా లక్ష్మినారాయణ. అయితే బీజేపీ అధిష్టానం జరిపిన సంప్రదింపులతో కాస్త మెత్తబడ్డారు. వైసీపీలో చేరకుండా ఆగిపోయి.. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. చివరకు ఆయనకే బీజేపీ పగ్గాలు అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.


          బీజేపీ పగ్గాలు తనకు అప్పగించడంపై కన్నా లక్ష్మినారాయణ సంతృప్తి వ్యక్తం చేశారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని, మనసావాచా పని చేస్తానని ప్రకటించారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. కన్నా లక్ష్మినారాయణ నియాకమం తెలిసిన వెంటనే ఆయన అనుచరులు సంతోషం వ్యక్తం చేశారు. ఆయన్ను అభినందించేందుకు నేతలు పెద్దఎత్తున తరలివచ్చారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా కన్నా లక్ష్మినారాయణను కలుసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: