‘కన్నా’ డ్రామాలు చూసి.. ఆశ్చర్యపోయిన జగన్.!!

Vasishta

కన్నా లక్ష్మినారాయణ మరోసారి వార్తల్లో నిలిచారు. బీజేపీ నుంచి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న వేళ అకస్మాత్తుగా ఆసుపత్రిపాలయ్యారు. అయితే అదంతా డ్రామానే అని కాసేపటికే అర్థమైపోయింది. వైసీపీలోకి వెళ్లకుండా ఆగిపోయేందుకే ఈ డ్రామా ఆడినట్లు తెలిసిపోయింది..


కన్నా లక్ష్మినారాయణ తన విశ్వసనీయతను మరోసారి కోల్పోయారు. ఏ ఎండకాగొడుగు పడ్తారని ఆయన్ను బాగా దగ్గర నుంచి చూసిన వాళ్లు చెప్తుంటారు. ఇప్పుడు అదే నిజమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న కన్నా లక్ష్మినారాయణ.. విభజన అనంతరం కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి బీజేపీలో ఉంటున్నారు. అయితే బీజేపీలో అంటీముట్టనట్లు ఉంటున్న కన్నా లక్ష్మినారాయణ.. తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ అధ్యక్ష పదవి రేసులో నిలిచారు. అయితే ఆయన్ను అధ్యక్షుడిగా నియమించడాన్ని బీజేపీలోని పాతకాపులు వ్యతిరేకించారు. దీంతో ఆయన్ను పక్కన పెట్టింది బీజేపీ అధిష్టానం. ఈ విషయం గ్రహించిన కన్నా లక్ష్మినారాయణ.. పార్టీ మారేందుకు పావులు కదిపారు.


బీజేపీలో ఎంతకాలమున్నా ఇంతకంటే ఎదిగేందుకు ఆస్కారంలేదని గ్రహించిన కన్నా లక్ష్మినారాయణ.. వెంటనే పార్టీ మారేందురు రంగం సిద్ధం చేసుకున్నారు. అనుచరులందరితో సమావేశం నిర్వహించి.. వాళ్లందరి చేత తన నిర్ణయానికి ఆమోద ముద్ర వేయించుకున్నారు. అంతే.. అనుచరులతో కలిసి 25న వైసీపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం మొత్తం ఏర్పాట్లన్నీ చేసేశారు. పేపర్లలో ప్రకటనలు కూడా ఇచ్చేశారు. ఇక తెల్లారితే చేరడమే తరువాయి. ఇంతలో కన్నా ఆసుపత్రి పాలయ్యారు. బీపీ పెరిగిపోయిందనే కారణంతో ఆయన జాయిన్ అయ్యారు. అయితే.. పార్టీ మారడం నుంచి తప్పించుకునేందుకే ఆయన ఇలా డ్రామా అడారని తర్వాత తెలిసింది.


కన్నా పార్టీ మారడం ఇష్టంలేని బీజేపీ అధిష్టానం ఆయన్ను అడ్డుకుంది. రాత్రికి రాత్రి ఆర్.ఎస్.ఎస్. నేతలు రంగంలోకి దిగి.. కన్నాకు కేంద్రంలో పెద్ద పదవి ఇస్తామని హామీ ఇచ్చారట.! బీజేపీ పెద్దలు టచ్ లోకి వచ్చి పెద్దపదవి ఇస్తామని చెప్పగానే కన్నాకు సడెన్ గా బీపీ పెరిగిపోయిందట. అందుకే హాస్పిటల్ లో జాయిన్ అయ్యారట. ఇదండీ సంగతి..! ఇక కన్నా చేరుతున్నారని ఎంతో ఆతృతగా ఈరోజు కోసం వెయిట్ చేసిన వైసీపీ శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి. కన్నా తీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇక.. తమ నేత వైసీపీలో జాయిన్ అవుతున్నారని తెలిసి పత్రికల్లో, టీవీల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చిన అనుచరగణమంతా లీడర్ తీరు చూసి విస్తుపోయారట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: