ఎర్రబెల్లికి టిక్కెట్ లేదా... పాల‌కుర్తిలో షాకింగ్ డెసిష‌న్లు..!

VUYYURU SUBHASH
పాలకుర్తి నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, అధికార టీఆర్ఎస్ నుంచి అసలు ఎవరు పోటీ చేస్తారన్న విషయంలో స్పష్టత ఉండడం లేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సీఎం కేసీఆర్ కేటాయించిన ప్రత్యేక నిధులతో చురుగ్గా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి కూడా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నిజానికి ఎర్రబెల్లి దయాకరరావు, జంగా రాఘవరెడ్డి పోటాపోటీగా తిరుగుతున్నారు. 


ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. తాజాగా వచ్చే ఎన్నికల్లో వీరిద్దరూ కూడా పాలకుర్తిలో బరిలో నిలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు జనగామ నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. ఇక వచ్చే ఎన్నికల్లో జంగా రాఘవరెడ్డికి టికెట్ ఇచ్చేదుకు కాంగ్రెస్ అధిష్టానం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మరో బలమైన నేత కోసం వెతుకుతున్నట్లు సమాచారం. 


ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి వినిపిస్తోంది. ఇక టీఆర్ఎస్ నుంచి పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్ రావు పేరు తెరమీదకు వచ్చింది. దీంతో వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో రెండు కొత్త ముఖాలు బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. అయితే, పాత చెన్నూరు, పాలకుర్తి నియోజకవర్గంలో మొదటి నుంచి వెలమ సామాజిక వర్గానికి చెందిన నాయకులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో రెడ్డి సామాజికవర్గ ఓట్లు అధికంగా ఉన్నాయి. 


వచ్చే ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎవరైనా పోటీ చేస్తే వారికే మద్దతు ఇవ్వాలన్న ఆలోచనలో ఆ సామాజిక వర్గం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నుంచి జంగా రాఘవరెడ్డి పాలకుర్తిలో తిరుగుతున్నారు. కానీ ఆయనకు టికెట్ వచ్చే అవకాశం లేదు. ఇటీవల రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన మానుకోట మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లోనే ఈ విషయంలో స్పష్టత వస్తుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: