'హాట్స్ ఆఫ్' టు 'మానిక్ సర్కార్...మీ జీవన విధానం అనితర సాధ్యం!'



ఈ దేశపు ముఖ్యమంత్రుల్లో అత్యంత దనికుడు సంపన్నుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐతే - అత్యంత నిరుపేద మాత్రం త్రిపుర ముఖ్య మంత్రి మానిక్ సర్కార్. జన జీవితాల్ని తన వ్యక్తిత్వంతో రెండు దశాబ్ధాలు ప్రేరేపిస్తూ వచ్చిన మహా మనీషి ఈ మాణిక్యం  స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ ఎఫ్ ఐ) కార్యకర్తగా ప్రారంభమైన తన రాజకీయ జీవితాన్ని అతి నిరాడంబరంగా నిజాయతీగా అత్యున్నత స్థాయికి అంటే ముఖ్యమంత్రి స్థాయి వరకు తీసుకెళ్ళగలిగారంటే ఆయన లోని నీతి నిజాయతీ ఋజువర్తన అనితరసాధ్యం. అంతేకాదు రెండు దశాబ్ధాలు కాల ప్రభావాన్ని తట్టుకొని నిజాయతీని నిలపటం అంత తేలిక కాదు కదా! 


తన తండ్రి అమూల్య సర్కార్ ఒక టైలర్. తల్లి అంజలి సర్కార్ రాష్ట్రప్రభుత్వంలో చిన్న ఉద్యోగి. అలా మొదలైన జీవితం అలాగే ముఖ్యమంత్రి స్థాయివరకు నడిపించి సాధరణ నిరాడంబర జీవితంలోని మాధుర్యాన్ని అందరికి పంచిన చైతన్య స్పూర్తి ఆయన.  


త్రిపుర ముఖ్యమంత్రిగా వరుసగా అప్రతిహతంగా 20ఏళ్లు ప్రజల ఆదరాభిమానాలతో కొనసాగి, నేడు పదవి నుంచి వైదొలుగుతున్న కమ్యూనిష్ట్ పార్టీ (మార్క్సిస్ట్) త్రిపుర నేత మాణిక్ సర్కార్ రెండు విషయాల్లో చరిత్రకెక్కారు. భారత దేశంలో "అతి పేద సీఎం మాణిక్ సర్కార్" అని ఆయన ఎన్నికల అఫిడవిట్ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ సీఎం గా 34ఏళ్లకు పైగా పనిచేసిన జ్యోతి బసు తర్వాత రెండు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన సీపీఎం నేతగా మాణిక్ సర్కార్ ది మరో రికార్డు. 49ఏళ్ల వయసులో ఆయన 1998లో ముఖ్యమంత్రి సీఎం పదవి చేపట్టారు.

Prime Minister Narendra Modi with Tripura CM Manik Sarkar at the inauguration of 726 MW gas based thermal power project at Palatana in Gomati district 

1960ల చివర్లో త్రిపుర కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమాల్లో ఉద్యమించి కమ్యూనిస్ట్ పార్టీ (మార్కిష్ట్)లో చేరారు. ప్రజా పోరాటాలకే అంకితమై సీపీఎం విస్తరణకు చేసిన కృషి ఫలితంగా 1972లో 23 ఏళ్లకే త్రిపుర రాష్ట్ర సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడయ్యారు. 49ఏళ్లకే సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడయ్యాక ముఖ్య మంత్రి పదవి తనకే దక్కింది. సొంత ఇల్లు లేని ఆయన తన ముత్తాతకు చెందిన అతి చిన్న ఇంట్లోనే ముఖ్యమంత్రిగా నివసించడం విశేషం. సొంత కారు లేకపోవడమేగాక, సీఎంగా తనకు వచ్చే జీతం మొత్తాన్ని పార్టీకే ఇచ్చి, పార్టీ నెల నెలా అందించే రూ.5000తోనే సరిపెట్టుకుంటున్నారు. అతి నిరాడంబర రాష్ట్రాధినేతగా ఆయన దేశానికే "మాణిక్యం" పదవీ విలాసాలకు దూరంగా లాల్ బహదూర్ శాస్త్రి అంతటి వానికి ధీటుగా జీవితాన్ని గడిపి ప్రజలకే తన జీవిత సర్వస్వాన్ని దారపోసిన మహనీయుడు మానిక్ సర్కారే.  


"సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు" ఉద్యోగిగా 2011లో పదవీ విరమణ చేసిన ఆయన భార్య పాంచాలీ భట్టాచార్య భర్తకు తగ్గ భార్య మాదిరిగానే అత్యంత నిరాడంబర జీవితం గడపు తున్నారు. ముఖ్యమంత్రి భార్య అయినా ఎలాంటి భద్రత లేకుండా రాజధాని అగర్తలా లో ఆమె రిక్షాలో ప్రయాణించడం నగర ప్రజలందరికీ తెలిసిన విషయమే. సీఎం అయ్యాక కూడా నగరంలో ఉదయం నడక కు మాణిక్ బయల్దేరడంతో భద్రతా సిబ్బంది పాంచాలి కి విషయం చెప్పగానే ఆమె భర్త కోసం "ట్రెడ్‌మిల్" కొని ఇంటికి తెచ్చారు.


"నా కళ్లజోడు ఖరీదు రూ.1800. చెప్పులు చాలా చౌక.  అయినా నీటుగా కనిపిస్తానంటే విలాసవంతమైన వస్తువులు వాడతానని అనుకోవద్దు" అని మాణిక్ సర్కార్ చెప్పిన మాటలు ఆయన నిరాడంబరతకు అక్షర రూపం. రోజూ ఓ చార్మినార్ సిగరెట్ ప్యాకెట్, చిన్న ప్యాకెట్ నస్యం ఉంటే చాలనీ, ఐదువేల రూపాయలకు తోడు తన భార్య పించను తో తమ కుటుంబ అవసరాలు తీరిపోతున్నాయని ఓ ఇంటర్వ్యూలో మానిక్ సర్కార్ వెల్లడించారు.  వరుసగా నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎంను అధికారం లోకి తెచ్చిన మాణిక్ సర్కార్ నాయకత్వం ఇరవై ఏళ్ల తర్వాత నిరుద్యోగం, అభివృద్ధి లేకపోవడం వంటి కారణాల వల్ల ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సివచ్చింది.


అత్యంత సంపన్న ముఖ్యమంత్రులు రాష్ట్రాలను అభివృద్ది చేసినా వాళ్ళ పాలనలో జాతి సంస్కృతి, సాంప్రదాయాలు చంకనాకి పోగా వారింట నిరుద్యోగం, వారి కుటుంబ అభివృద్ది మాత్రం అందలానికెక్కింది. బిపిఎల్ కు దిగువున ఉన్న ప్రజా జీవితం ఎంతో కొంత మెరుగు పడని నిరుద్యోగ నిర్మూలన, అభివృద్ది అనేవి ఎండమావిలో నీరు మాత్రమె.

దేశ వామపక్షాల చరిత్రలో మాణిక్‌ సర్కార్‌ది చెరిగిపోని ముద్ర. సాధారణ ప్రజల శాంతిభద్రతలు, జాతీయ భద్రత, అందరికీ తగిన గుర్తింపు, ముఖ్యమని నమ్మిన నేత. ఆర్థికఅంశాలతో పాటు సంస్కృతి కూడా ప్రధానమేనని విశ్వసించిన మనిషి. 1998లో ఆయన బాధ్యతలు చేపట్టేనాటికి బెంగాళీలు, గిరిజన తెగలమధ్య కల్లోలం నెలకొంది. బంగ్లాదేశ్‌ నుంచి తిరుగుబాటు దారులు రాష్ట్రంలో తరచూ హింసను ప్రేరేపిస్తున్న తరుణమది.


అలాంటి విద్రోహచర్యలను ఆయన సమర్ధంగా అణగదొక్కగలిగారు. గిరిజన ప్రాంతాల్లోనూ సీపీఎంను విస్తరించగలిగారు. సమాజ ప్రమాణాలను పెంచగలిగారు. తన బెంగాలీ గుర్తింపు కూడా పనిచేసింది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల్లోనూ అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. మాణిక్‌ సర్కార్‌ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పగలిగినప్పటికీ ప్రజల కాంక్షలు అంతకు మించి ఉన్నాయి. ఆయనకున్న ప్రతిష్ఠ, ఆర్థిక నిరాడంబరతలకు మించి రాష్ట్రంలో మార్పునకు ఇది సమయమని వారంతా విశ్వసించారు. మొత్తంగా కీలక తరుణంలో ఆ నేత పాలనకు త్రిపుర వీడ్కోలు పలికింది.



సంతానం వద్దనుకోవటంతో ఆయన రాజకీయ వారసుల బెడద ఆ రాష్ట్రానికే లేకుండా చేసిన ఆదర్శవ్యక్తి మానిక్. సుసంపన్న ముఖ్యమంత్రికి నిరుపేద ముఖ్యమంత్రికి అంతిమంగా పెద్ద తేడాలేదు. పోయేటప్పుడు ఏదీ వెంట రాదు. కాని వారు సుసంపన్నులు అయ్యే క్రమంలో ఆ అధికార జగన్నాధ రథచక్రాల క్రిందపడి నలిగిపోయే వ్యధార్థ జీవులెన్నో?     

కనుక...హాట్స్ ఆఫ్ టు మానిక్ సర్కార్. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: