ఆరెస్సెస్ వార్నింగ్ ను బేఖాతర్ చేసిన చంద్రబాబు..!

Vasishta

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవికి కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ పేరు ఖరారైంది. టీడీపీ పాలక మండలి సభ్యులపై కసరత్తు ఓ కొలిక్కి రాగా...ఛైర్మన్, పాలక మండలి సభ్యుల వివరాలపై రెండు రోజుల్లో ఉత్వర్వులు వెలువడనున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఛైర్మన్ తో పాటు, సభ్యుల పేర్లను ప్రకటించనున్నారు.


ఆరు నెలలుగా పెండింగ్ పడుతూ వస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక వర్గంపై కసరత్తు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో స్పష్టత ఇవ్వడంతో…ఇక కొత్త పాలకమండలి ప్రమాణస్వీకారం చేయడమే తరువాయిగా కనిపిస్తోంది. టీటీడీ చైర్మన్ గా టీడీపీ మైదకూరు సమన్వయకర్త, మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడైన పుట్టా సుధాకర్ యాదవ్ పేరు ఖరారైంది. టీటీడీ పాలకమండలి సభ్యులపై కూడా కసరత్తు కొలిక్కి రావడంతో... చైర్మన్‌తో పాటు సభ్యుల పేర్లను సీఎం చంద్రబాబు ప్రకటించనున్నారు..


పాలక మండలి ఛైర్మన్ పదవి కోసం మొదట్లో చాలా పేర్లే వినిపించాయి. ఎంపీలు రాయపాటి సాంబశివరావు, మురళీమోహన్‌ ఈ పదవి కోసం గట్టిగానే ప్రయత్నించి విఫలమయ్యారు. తర్వాత హరికృష్ణ, రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీ నారాయణ పేర్లు వినిపించాయి. మొన్నటివరకు నెల్లూరు మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు పేరు బలంగా వినిపించింది. అయితే వీరందరినీ తోసిరాజని.. పుట్టా సుధాకర్ పేరు తెరపైకి వచ్చింది.  పార్టీలో కీలక నేత యనమల రామకృష్ణుడుకు...పుట్టా సుధాకర్‌ యాదవ్ స్వయానా వియ్యంకుడు కావడంతో ఆయనకు ఈ పదవి కట్టబెట్టడం దాదాపు ఖాయమైంది. సుధాకర్‌ యాదవ్ గతంలో టీటీడీ పాలక మండలి సభ్యుడిగా పని చేశారు. యనమలే తన వియ్యంకుడికి ఈ పదవి ఇప్పించారని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. అనూహ్యంగా ఇప్పుడు టీటీడీ చైర్మన్‌ గా సుధాకర్‌ యాదవ్ ఎంపికకావడం వెనుక యనమల ఉన్నట్లు సమాచారం.


అయితే...  టీటీడీ కొత్త చైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ నియామకం కొన్ని నెలల కిందటే జరగాల్సి ఉన్నా.. ఆర్ఎస్ఎస్, కొందరు బీజేపీ మంత్రులు వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇటీవల ఉభయ వర్గాల మధ్య సయోధ్య కుదరడంతో పుట్టా సుధాకర్ యాదవ్ ఛైర్మన్ గా నియమితులు కానున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: