వైసీపీకి మరో షాక్..! టీడీపీలోకి వంగవీటి రాధా..!?

Vasishta

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు వైసీపీని వదిలి టీడీపీలో చేరారు. ఇక సెకండరీ కేడర్ కూడా పెద్దఎత్తున వైసీపీ నుంచి టీడీపీలో చేరిపోయింది. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో ఆ పార్టీకి మరిన్ని దెబ్బలు తప్పేలా లేవు. ఇందుకు తాజా ఉదాహరణ వంగవీటి రాధా.


వంగవీటి కుటుంబానికి కృష్ణా జిల్లాలోనే కాక.. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో పేరుంది. వంగవీటి రాధా నుంచి వారసత్వం పొందిన వంగవీటి రాధా కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత గత ఎన్నికల్లో ఓడిపోయారు. అనంతరం ఆయన వైసీపీ గూటికి చేరారు. కొంతకాలం యాక్టివ్ గా వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొన్న వంగవీటి రాధా .. ఆ తర్వాత కామ్ అయిపోయారు. జగన్ వ్యవహారం నచ్చకే రాధా కామ్ అయిపోయారనే వార్తలు వినిపించాయి.


తాజాగా.. తాను పోటీ చేయాలనుకున్న నియోజకవర్గం విషయంలో జగన్ వ్యవహరించిన తీరు వంగవీటి రాధాను తీవ్రంగా బాధించిందని సమాచారం. సెంట్రల్, ఈస్ట్ నియోజకవర్గాలలో ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని రాధా భావించారు. అయితే ఆ రెండు నియోజకవర్గాలను మల్లాది విష్ణు, యలమంచిలి రవిలకు కేటాయించినట్లు జగన్ స్పష్టం చేశారు. రాధాను అవనిగడ్డ నుంచి పోటీ చేయాలని సూచించారు. దీంతో రాధా తవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.


ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకున్న రాధా.. పార్టీ మారితే బాగుంటుందని అనుచరులతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ గెలుపు ఖాయమని, వైసీపీ అధికారంలోకి రావడం కలేనని రాధా అనుచరులకు చెప్పినట్టు సమాచారం. దీంతో.. అనుచరులు కూడా రాధాను పార్టీ మారాల్సిందిగా ఒత్తిడి చేసినట్టు వార్తలొస్తున్నాయి. పైగా.. కృష్ణా జిల్లాలోని కాపులు కూడా అధికార పార్టీవైపే ఉన్న విషయాన్ని వారు గుర్తు చేసినట్టు సమాచారం.


అయితే పార్టీ మార్పునకు సంబంధించి రాధా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏడాది క్రితమే రాధా పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపినట్టు టీడీపీ వర్గాలు మాత్రం వెల్లడించాయి. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన నుంచి తిరిగొచ్చిన తర్వాత రాధా.. చంద్రబాబును కలుస్తారని సమాచారం. ఇదే జరిగితే కృష్ణా జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే.!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: