మోదీ వెంటే రజనీకాంత్..!

Vasishta

తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా ఉంటున్నాయి. ఓ వైపు అన్నాడీఎంకోలో ఆధిపత్యపోరు కొనసాగుతుండగానే.. మరోవైపు కమల్ హాసన్ రాజకీయరంగ ప్రవేశానికి ముహూర్తం చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఏం చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. కమల్ హాసన్ మాత్రం రజనీని తన పార్టీలోకి ఆహ్వానించారు. మరి రజనీ మనసులో మాటేంటి..?


                రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ ఇటీవల చాలా గట్టిగా వినిపిస్తోంది. ఆయనకు మద్దతుగా పలు అభిమాన సంఘాలు సభలు, సమావేశాలు పెట్టాయి. కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఆయన రాకను స్వాగతిస్తున్నాయి. అయితే రజనీకాంత్ మాత్రం ఇంతవరకూ ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. ఇంతలోనే కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టే పనుల్లో చాలా హడావుడి చేస్తున్నారు. ఆయన కూడా రజనీని తన పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. దానికి కూడా రజనీ స్పందించలేదు.


          అయితే తన మద్దతు మోదీకేనన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్.. కానీ రజనీ మద్దతు పలికింది రాజకీయాల్లో కాదు. స్వచ్ఛభారత్ ను విస్తృతంగా ప్రచారంచేస్తున్న మోదీ, దానిలో పాల్పంచుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఆ జాబితాలో రజనీకాంత్ కూడా ఉన్నారు. ప్రధాని పిలుపునకు స్పందించిన రజనీకాంత్.. స్వచ్చతా సాహి కార్యక్రమానికి మద్దతు పలికారు. స్వచ్ఛభారత్ స్ఫూర్తిని తీసుకెళ్తానని చెప్పారు.


          మోదీ పిలుపునకు స్పందించిన రజనీకాంత్ ఈ కార్యక్రమానికి మాత్రమే మద్దతిస్తారా.. లేకుంటే రాజకీయంగా కూడా బీజేపీతో ఉంటారా.. అనేదానిపై ఉత్కంఠ మొదలైంది. రజనీకాంత్ బీజేపీలో చేరుతారని, వచ్చే ఎన్నికలనాటికి ఆయనే సీఎం అభ్యర్థి అవుతారని చాలాకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై అటు బీజేపీ, ఇటు రజనీకాంత్ ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదు. అయితే ఇప్పుడు స్వచ్ఛభారత్ విషయంలో తాను మోదీ వైపు ఉన్నట్టు రజనీ స్పష్టంగా చెప్పడంతో... రాజకీయాల్లో కూడా ఇవే సమీకరణాలు ఉండే అవకాశం ఉందని తమిళనాట ఊహాగానాలు మొదలయ్యాయి. మరి ఇవి వాస్తవమో కాదో వేచి చూద్దాం..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: