టీటీడీ ఛైర్మన్ రేసులో ‘గాలి’..!

Vasishta

రాష్ట్రంలో అత్యధిక డిమాండ్ ఉన్న పోస్టుల్లో టీటీడీ ఛైర్మన్ ఒకటి. ఈ సీటులో ఎవరిని కూర్చోబెట్టాలో అర్థం కాక సీఎం చంద్రబాబు తలలు పట్టుకుంటున్నారు. పోటీ అధికంగా ఉండడం, ఒత్తిడి కూడా అంతే స్థాయిలో ఉండడంతో ఎటూ తేల్చకుండా సీఎం కామ్ గా ఉండిపోతున్నారు. ఈ నేపథ్యంలో మరో వ్యక్తి తనకు ఈ పదవి కేటాయించాలంటూ ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.


          టీటీడీ ఛైర్మన్ కావాలంటూ ఎంపీలు రాయపాటి సాంబశివరావు, మురళీమోహన్ తీవ్రంగా పోటీ పడిన విషయం తెలిసింది. అయితే ఆల్రెడీ పదవుల్లో ఉన్నవారికి టీటీడీ ఛైర్మన్ ఇచ్చే ఉద్దేశం లేనట్టు చంద్రబాబు తేల్చి చెప్పడంతో వాళ్లు కామ్ అయిపోయారు. అవసరమైతే ఎంపీ పదవి వదులుకుంటానని, ఒక్కసారి ఛైర్మన్ పదవి ఇవ్వాలని రాయపాటి చెప్పినా సీఎం వినిపించుకోలేదు. నిర్ద్వందంగా తోసిపుచ్చారు.


          ఆ తర్వాత రేసులోకి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త రవిశంకర్ పేరు వినిపించింది. ఉత్తరాదికి చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఆయన్నుప్రతిపాదిస్తూ ఒత్తిడి తెచ్చారు. అయితే ఉత్తరాది వారికి ఇచ్చే ఉద్దేశం లేదని చంద్రబాబు సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. అయితే ఆ తర్వాత నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత, చంద్రబాబుకు ముఖ్య అనుచరుడిగా పేరొందిన మస్తాన్ యాదవ్ కు ఇవ్వబోతున్నారనే టాక్ వినిపించింది. శ్రీవెంకటేశ్వరునితో యాదవులకు అవినాభావ సంబంధం ఉంది. అందుకే వారిని ఆ పదవిలో కూర్చోబెడితో బాగుంటుందని భావించారు. అయితే ఏమైందో ఏమో ఆయన స్థానంలో మదనపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త, ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఆ పేరు కూడా వెనక్కు వెళ్లిపోయింది.


          తాజా లిస్టులో టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీకి సుదీర్ఘంగా సేవలందిస్తున్న తనకు ఆ పదవి ఇవ్వాలని ఆయన చంద్రబాబును కోరినట్టు సమాచారం. గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయనకు తగిన గుర్తింపు లభించలేదని భాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో తనకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది.


          ఓవరాల్ గా తీసుకుంటే ప్రస్తుతం గాలి ముద్దకృష్ణమనాయుడు, బీద మస్తాన్ యాదవ్, ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి వీరిలో ఎవరిని ఆ వెంకటేశ్వరుడు, ఈ చంద్రబాబు కరుణిస్తారో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: