నంద్యాలలో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్న కాంగ్రెస్..!!

Vasishta

నంద్యాల ఉపఎన్నికను తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. నంద్యాల సీటును కైవసం చేసుకుంటామనే ఉద్దేశంలో లేదు కానీ.. తమ బలమేంటో చూపించుకునేందుకు ఈ ఎన్నికను ఓ మహదవకాశంగా భావిస్తోంది ఆ పార్టీ. అందుకే శాయశక్తులా ప్రచారం చేస్తోంది. ముఖ్యమంగా మైనారిటీల ఓట్లను నమ్ముకుని ముందుకు సాగుతోంది.


          రాష్ట్ర విభజన తర్వాత కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా గెలవలేదు. ఆ తర్వాత కూడా పెద్దగా బలపడినట్లు కనిపించలేదు. అయితే పీసీసీ చీఫ్ రఘువీరా మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడుతూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా రాష్ట్రంలో మళ్లీ బలపరచాలని తపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన నంద్యాల ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశంగా మారింది.


          ఆది నుంచి కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలు మంచి ఆప్తులు. నంద్యాలలో కూడా నిర్ణయాత్మక ఓటర్లు మైనారిటీలే కావడంతో తమ బలమేంటో చూపించుకునేందుకు ఇదొక చక్కని వేదిక అని కాంగ్రెస్ పార్టీ భావించింది. అందుకే నంద్యాలలో పోటీ పెట్టాలని తీర్మానించి.. ఆ మేరకు అభ్యర్థిని రంగంలోకి దింపింది. టీడీపీ, వైసీపీలకు భిన్నంగా మైనార్టీ అభ్యర్థినే బరిలోకి దించి... ప్రచారం చేస్తోంది.


          టీడీపీ, వైసీపీలు రెండూ బీజేపీతో అంటకాగాయని.. ఆ పార్టీల్లో దేనికి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లేననేది కాంగ్రెస్ పార్టీ నినాదం. ఇదే నంద్యాల ప్రచారంలో ప్రచారాస్త్రంగా మారింది. ఇలా చేయడం ద్వారా మైనార్టీల ఆదరణ పొందవచ్చనేది ఆ పార్టీ లక్ష్యం. ఒకవేళ ఈ నినాదం సఫలమైతే ఓ మోస్తరు ఓట్లను సాధించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది కూడా ఇదే. తాము బలపడ్డామనే సంకేతమివ్వడమే ఇప్పుడు ఆ పార్టీ ముందున్న అతి పెద్ద టార్గెట్. ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ఆ పార్టీ సమూలంగా తుడిచిపెట్టుకుపోయింది. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది.


          ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆశలన్నీ నంద్యాల ఉపఎన్నికపైనే. కనీసం డిపాజిట్ దక్కించుకోగలిగితే ఆ పార్టీ పరువు నిలిచినట్లే. డిపాజిట్ దక్కించుకోగలగితే టీడీపీ, వైసీపీల జాతకాలు మారిపోతాయ్. మరి ఆ స్థాయి ఓట్లు సాధిస్తుందా..? పునర్వైభవం సాధిస్తుందా..? అనేది వేచి చూడాల్సిందే.!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: