ఉపాదిపోయే...ఉత్పత్తి లేదాయే : అసలు కంటే కొసరుతోనే కష్టాలు

ఉపాదిపోయి ఊరిమీద పడుతున్నారు కార్మికులు,ఉత్పత్తి నిలచి పోయి యజమానులతో పాటు వినియోగదారులకు ఏమి దొరకక ఎన్నో కష్టాలు, ఇదంతా కరెంటు కోతతో అని ఇట్టే చెప్పేస్తారు అందరు. కాని ప్రభుత్వం విధిస్తున్న కరెంటుకోత వల్ల వచ్చిన కష్టాలు కావివి. దీనికి కొసరుగా సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ కరెంటు తీస్తున్న అధికారుల వల్ల వచ్చిన తిప్పలు. అధికారికంగా పరిశ్రమలకు రోజుకు మూడు గంటలు విద్యుత్ కోత విధిస్తున్నారు. కాని అదనంగా కనీసం మరో మూడు నుంచి నాలుగు గంటలపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అధికారులు పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో చిన్నపరిశ్రమలు మూతపడుతుండగా చాలా మటుకు మద్యతరహా పరిశ్రమలు వారి రెగ్యులర్ ఉద్యోగుల జీతభత్యాలు,పరిశ్రమ మేంటెనెన్స్ ఖర్చుల కోసం అంతో ఇంతో నడిపిస్తున్నారు. ఈపరిస్థితి హైదరాబాద్ తో పాటు పారిశ్రామికంగా అభివృద్ది చెందుతున్న కరీంనగర్,వరంగల్,నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లోని పట్టణాల్లో, వ్యవసాయ ఆదారిత పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ఉభయగోదావరి జిల్లాల్లో ఈకొసరు కోతలు పెడుతున్న వాతలకు జనం విలవిలలాడుతున్నారు. ఉదహరణకు పరిశీలిస్తే రైస్ మిల్లులు లేని ప్రాంతాలు దాదాపు రాష్ట్రంలో లేవని చెప్పవచ్చు. ఈమిల్లుల్లో ఎక్కువగా పనిచేసేది దినసరి కార్మికులు, కూలీలే. మిల్లింగ్ ద్వారా వచ్చే బియ్యం,తవుడు,ఉనక వేరువేరు బస్తాల్లో ప్యాక్ చేసి ఏరోజుకారోజు సంపాదించి పొట్టపోసుకునే కుటుంబాలు రాష్ట్రంలో లక్షల్లో ఉంటారు. బియ్యాన్ని బస్తాల్లో నింపి లారీల్లో లోడ్ చేయడం, మిల్లుకు వచ్చిన వరిధాన్యాన్ని అన్ లోడ్ చేసి మిల్లులోకి తరలించడం వంటి పనులు చేస్తూ ఉపాది పొందేది దినసరి కూలీలే. కరెంట్ లేక వీరంతా ఉపాదికోల్పోయి ఊరిమీద పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మిల్లింగ్ లేక అవసరానికి సరిపడా బియ్యం మార్కెట్ లోకి రాక ధరలు అమాంతం పెరిగి సామాన్యుని కడుపులు ఆకలితో మండే పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రూపాయి కిలో బియ్యం పథకం మీద ప్రభావం చూపుతోంది. మిల్లర్లు అవసరానికి తగినంత లెవీ బియ్యం అందించలేకపోతున్నారు. దీంతో రేషన్ కోటాలోను వాతలు పడే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. రైతుల నుంచి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. పలితం పండించిన ధాన్యాన్ని విక్రయించి సొమ్ముచేసుకో లేక,గోదాముల వంటి సౌకర్యం లేక నిల్వఉంచుకోలేక రైతులకు కష్టాలు తప్పడం లేదు. కేవలం ఒక రైస్ మిల్ వంటి చిన్నపరిశ్రమ వల్లనే ఇన్ని కష్టాలు వస్తున్నాయంటే మిగిలిన వందలాది ఇతర ఉత్పత్తుల పరిశ్రమలు నడువక ఎన్ని అవస్థలు పడుతున్నారో అర్థంచేసుకోవచ్చు. అసలు కోత ఎలాగు తప్పదు,కొసరు కోతనైనా నివారిస్తే మెజారిటి కష్టాలు దూరం అవుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: