హైదరాబాద్: వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు టచ్ లో ఉంటున్నారా? వారు ఎప్పుడైనా జగన్ శిబిరంలో చేరిపోవచ్చా? అంటే రాష్ర్ట యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సుధాకర్ బాబు ఔననే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో జగన్ శిబిరంతో టచ్ ఉంటున్న వారి వివరాలను రాబట్టాల్సిందిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఫోన్ సంభాషణల్ని పరిశీలిస్తే ఎవరెవరు జగన్ శిబిరంతో టచ్ లో ఉంటున్నారో తెలుస్తుందన్నారు. సుధాకర్ బాబు వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఆయన చెప్పినట్లుగానే రాష్ర్టంలో చాలా మంది కాంగ్రెస్ నేతలు జగన్కు కోవర్టులుగా పనిచేస్తున్నారనీ తెలంగాణ ఎంపీలు వీహెచ్, పాల్వాయి, మధుయాష్కీ తదితరులు అంటున్నారు. పార్టీలో ఉంటూ పార్టీకి నష్టం కల్గించే విధంగా వ్యవహారిస్తున్న కేవీపీ లాంటి వారిని తరిమి తరిమి కొట్టాల్సిందిగా ఎంపీ మధుయాష్కీ పిలుపునిచ్చారు. ఇంత జరుగుతున్నా సీఎం కిరణ్ కానీ, పీసీసీ చీఫ్ బొత్స కానీ పల్లెత్తు మాట అనడం లేదు. అన్నింటికి మౌనంగానే ఉంటున్నారు.
కాంగ్రెస్ పార్టీలోని పలువురు మంత్రులు సైతం జగన్ శిబిరంతో టచ్ లో ఉంటున్నట్లు యూత్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సుధాకర్ బాబు చేసిన వ్యాఖ్యలు నిజమేననీ అన్నట్లుగా వైఎస్ఆర్ పార్టీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడారు. రాష్ర్టానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ మంత్రులు తమతో టచ్లో ఉన్న మాట వాస్తవమేననీ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీకి చెందిన చాలా మంది ప్రజాప్రతినిధులు తమతో టచ్లో ఉన్నారనీ, అయితే, గుడ్డిగా ఎవర్ని పడితే వారిని పార్టీలోకి తీసుకోమన్నారు. జల్లెడ పట్టిన తరువాతనే ఎవర్ని అయినా పార్టీలోకి తీసుకుంటామంటూ మాట్లాడి కాంగ్రెస్ పార్టీని మరింత ఇరకాటంలోకి నెట్టారు నెల్లూరు ఎంపీ మేకపాటి.
ప్రస్తుతం ఉన్న పార్టీల్లో ఉంటే తమ రాజకీయ భవిష్యత్ లేదనే నిర్ణయానికి చాలా మంది నేతలు వచ్చారనీ, దీనితోనే జనంలో బాగా బలం ఉన్న నాయకుడిగా, జన నేతగా ముద్రపడిన జగన్ పార్టీలో చేరేందుకు చాలా మంది ఉత్సాహాన్ని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా 2014ఎన్నికల నాటికీ అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ పార్టీలకు చెందిన అనేక మంది ప్రజాప్రతినిధులు గోడ దూకడం ఖాయమనీ, దీన్ని ఎవరూ ఆపలేరనీ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ప్రజల తమ వైపు రావడం లేదనీ, ప్రజలు ఉన్న వైపే తాము వెళ్లాలనీ సదరు ప్రజాప్రతినిధులు గ్రహించినట్లు చెప్పకనే చెబుతున్నారు మరి.
మరింత సమాచారం తెలుసుకోండి: