హైదరాబాద్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఎమ్మార్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ పారిశ్రామికవేత్త కోనేరు ప్రసాద్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. దీనితో ఆయన మరి కొన్ని గంటల్లో చంచల్ గూడ జైలు నుంచి బయటకు రానున్నారు. గత 9నెలలుగా కోనేరు జైల్లోనే ఉన్నాడు. ఎమ్మార్ కేసులో కోనేరుకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఇక బెయిల్లు షురూ అయినట్లు అంతటా ప్రచారం సాగుతోంది. ఎమ్మార్ కేసులో అరెస్టయినప్పటి నుంచి కోనేరు బెయిల్ కోసం శతవిధాల ప్రయత్నాలు చేసారు. ఆయన బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేయడం దానికి కౌంటర్ గా సీబీఐ తన వాదనాలు వినిపించడంతో ప్రతిసారీ ఆయనకు కోర్టు బెయిల్ నిరాకరించింది. అయితే, ఎట్టకేలకు ఇప్పుడు మరోమారు హైకోర్టును ఆశ్రయించాడు.
అక్కడ న్యాయమూర్తి కోనేరు,సీబీఐ తరుపున వాదనలు విన్న తరువాత షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. 5లక్షల పూచీకత్తుతో పాటు కేసు విచారణలో ఉన్నందున రాష్ర్టం విడిచి వెళ్లరాదంటూ కోర్టు షరతు విధించింది. దీనికి కోనేరు తరుపు న్యాయవాది అంగీకరించడంతో న్యాయస్థానం బెయిల్‌ని మంజూరు చేసింది. మొత్తానికి 9నెలల జైలు జీవితం అనంతరం కోనేరు ప్రసాద్ బయటి ప్రపంచాన్ని చూడబోతున్నారన్నమాట. గతంలో ఆయన అయ్యప్పమాల వేసుకున్న సందర్భంలో శబరిమలకు వెళ్లేందుకు ఎస్కార్టుతో కూడిన తాత్కాలిక బెయిల్‌ను కోర్టు ఇచ్చిన విషయం విధితమే.
మరింత సమాచారం తెలుసుకోండి: