హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం మళ్లీ ఊపందుకోనున్నది. తెలంగాణ ఉద్యమం ఆగస్టు నుంచి ప్రారంభం కాబోతున్నట్లు ‘ఏపీహెరాల్డ్’ ఇప్పటికే చెప్పింది. ఏపీహెరాల్డ్ చెప్పినట్లుగానే ఈ రోజు నుంచి ఆందోళనలకు తెలంగాణ ప్రజాఫ్రంటు పిలుపునిచ్చింది. సహాయనిరాకరణ చేపట్టనున్నారు.
మా ప్రాంతాన్ని మేమే పాలించుకుంటాం. మాపై స్థానికేతరులైన పాలకుల పెత్తనం వద్దు అంటూ మహాత్తరమైన ఈ కార్యక్రమం నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు ‘క్విట్ తెలంగాణ’ పేరిట ఆందోళనలకు టీఫీఎఫ్ పిలుపునిచ్చింది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పది జిల్లాలలో నిరసన కార్యక్రమాలు చేసేందుకు సిద్దమయ్యారు.
తొమ్మది రోజుల పాటు వివిధ రూపాల్లో స్థానికేతరులైన పాలకులు వెళ్లిపోవాలంటూ నిరసనలు, ఆందోళనలు కొనసాగుతాయి. ఆగస్టు నెల అంటేనే సంక్షోభ నెల అని వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.
తెలంగాణపై సీమాంధ్ర నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ
ప్రజాఫ్రంటు, తెలంగాణవాదులు, టీఆర్ఎస్, టీజేఏసీ, విద్యార్థి సంఘాలు మళ్లీ ఉద్యమ బాటను పడుతున్నాయి. స్థానికేతర పాలకులు వెళ్లిపోవాలనీ డిమాండు చేస్తూ టీపీఎఫ్ ఆందోళనకు శ్రీకారం చుడుతోంది. విద్యార్థులు పుస్తకాలను పక్కన పెట్టనున్నారు. మళ్లీ పోరు తెలం‘గానం’ బాట పట్టేందుకు సన్నద్దమవుతున్నారు.
రాజకీయ పార్టీల నాయకల మాటలు నమ్మితే ‘కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లే’అనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏ పార్టీ జెండా కింద కాకుండా, వారే స్వయంగా కదనరంగంలోకి దూకేందుకు నిశ్చయించుకున్నారు. చావో, రేవో తేల్చుకోవడానికి గానూ ఆగస్టు నెలలో ఉస్మానియా విశ్వవిద్యాలయంకు చెందిన తెలంగాణ విద్యార్థి సంఘం నాయకులు అసెంబ్లీ ముట్టడికి ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు.
సెప్టెంబర్లో తెలంగాణ రాజకీయ జేఏసీ ఛలో హైదరాబాద్కు పిలుపునిచ్చింది.
టీఆర్ఎస్ కూడా తెలంగాణ ఉద్యమాన్ని మరోమారు రగల్చడానికి చాపకింది నీరులా ఉద్యమ ప్రణాళికను ఖరారు చేసుకునే పనిలో నిమగ్నమైంది. ఇలా ఎవరికి వారుగా ఈ దఫా తెలంగాణ ఉద్యమాన్ని ఉధ్రుతం చేసేందుకు పకడ్బందీ ప్రణాళికతో సిద్ధమవుతున్నారు. తెలంగాణలో ఉన్న వనరులపై కన్నేసిన ఆంధ్రపాలకులు 1956నుంచి ఈప్రాంతాన్ని దోచుకోవడం ప్రారంభించారనీ ప్రజాఫ్రంటు ఆరోపిస్తుంది.
తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రలో బలవంతంగా విలీనం చేసుకున్నారే తప్ప, ఈ ప్రాంత ప్రజల ఇష్టంతో కాదనీ, క్విట్ తెలంగాణ స్వాతంత్ర్యోద్యమ స్పూర్తితో జరిపేందుకు టీపీఎఫ్ అన్ని ఏర్పాట్లను చేసుకుంది. తొమ్మిది రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు, నిరసనలతో క్విట్ తెలంగాణ పోరాటాన్ని నిర్వహించనున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: