సైకోల సవాళ్లు!

 హైదరాబాద్: సైకోలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. పోలీసులకు దొరికినట్లే దొరికి తప్పించుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే సదరు సైకోలు పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు. పోలీసులకు చిక్కిన సాంబను అప్పుడే మట్టుబెట్టి ఉంటే తడ సంఘటన జరిగి ఉండేది కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పోలీసుల నిర్లక్ష్యం ఖరీదు మూడు నిండు ప్రాణాలు. గుంటూరు జిల్లాకు చెందిన సాంబ అలియాస్ సాంబశివరావు గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల్ని భయపెడుతూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నాడు. మొన్న క్రిష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేసిన సైకో సాంబ పోలీసులకు దొరికినట్లే దొరికి తప్పించుకున్న విషయం విధితమే.  అతని ఆచూకీ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. అయినప్పటికీ అతగాడి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. సైకో సాంబ గురించి పోలీసులు రాత్రింబవళ్లు తిరుగుతుంటే ... తాజాగా మరో సైకో బరితెగించాడు. భద్రాచలం నుంచి చెన్నై వెళ్తున్న ఆర్టీసీ బస్ లో ఒకరికి తెలియకుండా ఒకర్ని ముగ్గుర్ని హతం చేశాడు. చెన్నై వెళ్తున్న ఆర్టీసీ బస్లో సదరు సైకో ప్రయాణికుని మాదిరిగానే ప్రయాణించి ప్రయాణికులంతా నిద్రపోతున్న వేళ పక్కవారికి కూడా అనుమానం రాని విధంగా ముగ్గుర్ని హత్య చేశాడు. మరికొందర్ని గాయపర్చాడు. ఎవరికీ అనుమానం రాకుండా గొంతులు కోసి హతమార్చిన సైకో గురించి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. చివరకు గొంతు కోసిన వారి నుంచి కూడా ఎలాంటి శబ్దం రాకుండా హతమార్చిన వైనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. నిద్రిస్తున్న వారిని కత్తితో హతమార్చి బస్ నడుస్తుండగానే దూకి పారిపోయాడనీ ఆర్టీసీ డ్రైవర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.  పక్కన ఉన్న వారికి కూడా అనుమానం రాకుండా హతమార్చడమంటే మామూలు విషయం కాదు. ఆర్టీసీ బస్ లో ఉన్మాది బీభత్సం స్రుష్టించడం రాష్ర్ట వ్యాప్తంగా కలకలంరేపింది. దీనిపై ముఖ్యమంత్రి కిరణ్ కూడా వెంటనే స్పందించారు. ఉన్మాది జాడ కనుక్కోవల్సిందిగా నెల్లూరు పోలీస్ బాస్ ను ఆదేశించారు. సీఎం ఆదేశాలందుకున్న పోలీస్ యంత్రాంగం ఆంధ్ర-తమిళనాడు ప్రాంతంలో సదరు ఉన్మాది కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. ఓ వైపు సైకో సాంబ గురించి పోలీసులు జల్లెడ పడుతుండగానే...మరో సైకో విరుచుకుపడ్డాడు. నిద్రిస్తున్న ప్రయాణికులపై కత్తితో దాడి చేసి హతమార్చాడు.  గుంటూరు, ప్రకాశం జిల్లా ప్రజల్ని వణికిస్తున్న సాంబ, తడ వద్ద ఆర్టీసీ బస్ లో బీభత్సం స్రుష్టించిన ఉన్మాది ఒక్కడేనా? అనే దానిపై కూడా విచారణ సాగుతోంది. మొత్తానికి సైకోల బీభత్సకాండ ప్రజల్ని వణికిస్తుండగా, పోలీసులకు సవాల్ గా మారింది. సైకోల బారి నుంచి ఈ రాష్ర్ట ప్రజలు ఎప్పుడు విముక్తి అవుతారో చూడాలి మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: