లైవ్ షో: పెద్దలకు మాత్రమే

 హైదరాబాద్: రాష్ర్టంలోని రెండు టీవీ చానెల్స్ చూసి ప్రేక్షకులు సిగ్గుతో తలదించుకుంటున్నారు. లైవ్ షో పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాలు చూసి మతి తప్పుతోంది. బాధపడుతున్నారు. తిట్టుకుంటున్నారు. చూడలేకపోతున్నారు. సదరు చానెల్స్ నిర్వహాకులు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. వారి రేటింగ్ కోసమో, మరి ఇంకేదైనా ఆశించో చేస్తున్నారో తెలియదు కానీ మొత్తానికి సదరు చానెల్స్ మాత్రం చర్చల పేరిట ఊదరగొడుతున్నారు. పెద్దలకు మాత్రమే అన్నట్లుగా వారు కార్యక్రమాలను నిర్వహిస్తున్న తీరు జుగుప్సకరంగా మారింది.  ‘మీరు తన్నుకు చావండి మేము తనువరా నవ్వుకుంటాం’ అన్నట్టుగా ‘చాట్లో తవ్వుడు పోసి కుక్కలను ఎగబెట్టినట్టుగా’ బద్ద శత్రువులను చర్చా కార్యక్రమాల పేరిట పిలుస్తూ పత్రికల్లో రాయలేని విధంగా తిట్టుకుంటుంటే సదరు చానెల్స్ వాళ్లు మాత్రం యమ ఎంజాయ్ చేస్తున్నారు. పేరుకు మాత్రం మెరుగైన సమాజం కోసమనీ, మా అక్షరం మీ ఆయుధమంటూ చెప్పుకుంటున్న చానెల్స్ వాళ్లు చేస్తున్నది మాత్రం సభ్యసమాజం తలదించుకునే విధంగా చేస్తున్నారు. తాజాగా ఆ రెండు చానెల్స్ వాళ్లు నిర్వహించిన చర్చా కార్యక్రమాల్లో సదరు రాజకీయ నాయకులు బూతులు తిట్టుకున్నప్పటికీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యాంకర్లు గుమ్మనకుండా ఉన్నారు.  తిట్ల వర్షం ముగిసిన తరువాత కానీ, కార్యక్రమ నిర్వహాకులు వారిని సముదాయించే ప్రయత్నం చేయలేదు. ఆ రెండు చానెల్స్ నిర్వహించిన లగడపాటి రాజగోపాల్-తన్నీరు హరీశ్ రావు, తారాచౌదరీ ఇంటర్యూ, కొడాలి నాని- ఉమల లైవ్ షో తీసుకుంటే చానెల్స్ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నాయో అర్థం కావడం లేదు. మీడియా తమ చేతుల్లో వుంది. తాము ఏం చేయాలనుకుంటే ‘అదీ’ చేయవచ్చు అనుకుంటున్నట్టుగా ఆ రెండు చానెల్స్ వ్యవహరిస్తున్నాయి. మెడికల్ సీట్లకు సంబంధించి తన్నీరు హరీశ్-లగడపాటి రాజగోపాల్ ను చర్చకు పిలిచిన ఓ చానెల్ యజమాన్యం లైవ్ షో లోనే ఇష్టం వచ్చినట్లుగా తిట్టుకున్నారు. వీరిద్దరు లైవ్ లోకి వస్తే చర్చ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. మీడియాలో రాయడానికి వీలులేని విధంగా తిట్టుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. తెలిసీ కూడా వారిద్దర్నీ లైవ్ లోకి తీసుకోవడంలో ఆ చానెల్ ఉద్దేశం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. అదే విధంగా సెక్స్ రాకెట్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తారాచౌదరీని వరుసగా రెండ్రోజుల పాటు గంటలకొద్దీ లైవ్ లో కూర్చుండబెట్టింది. లైవ్ షోలో తారాచౌదరీ మాట్లాడిన మాటలు వింటే ఆమె వ్యవహారం ఏమిటో అందరికీ ఇట్టే అర్థమైపోతది. దీని వల్ల సమాజానికి వచ్చిన లాభమేమిటో అర్థం కాలేదు.  ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో రోజుల తరబడిగా లైవ్ షో నిర్వహించడం వెనుక చానెల్స్ వారికి కొన్ని ప్రయోజనాలుండవచ్చు. ఆమెతో కొందరికీ క్లీన్ చీట్ ఇప్పించిది. మరికొందర్ని తెరపైకి తెప్పించింది. ఆమె లైవ్ షో కొందరి జీవితాలను ఆగం చేయవచ్చు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కొంత మేరకు వెనుకేసుకు రావచ్చు. కానీ, సమాజానికి మాత్రం దానివల్ల ప్రయోజనం మాత్రం శూన్యం. ఇక మరో చానెల్ నిర్వహించిన లైవ్ షోలో కొడాలినాని-ఉమలు బూతులు తిట్టుకున్నారు. వీరిద్దరికి కూడా మొదటి నుంచీ పడదు.  అలాంటి వార్ని లైవ్ లోకి తెచ్చారు. రాయడానికి వీలు లేని విధంగా తిట్టుకున్నారు. చాలాసేపు తిట్టుకున్న తరువాత కానీ ఇక్కడ కూడా యాంకర్ నోరు మెదపలేదు. సమాజాన్ని ఉద్దేరించడానికి తాము పుట్టామని చెప్పుకుంటున్న చానెల్ వాళ్లు లైవ్ షోలపేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాలు సమాజం పాడైపోయే విధంగా ఉంటున్నాయి. ఇద్దరు బద్ద శత్రువులను లైవ్ లోకి తెచ్చి వారు బూతుపురాణాలు తిట్టుకుంటుంటే ఎంజాయ్ చేయడం ఆ రెండు చానెల్స్ వారికే చెల్లింది.  సమాజాన్ని ఉద్దరించకపోయినా ఫర్వాలేదు కాని, ఇలాంటి కార్యక్రమాల వల్ల సమాజం మరింత చెడిపోవడం తథ్యం. వారి ప్రయోజనాల కోసం మీడియాను వాడుకోవడం నిజంగా దురద్రుష్టకరం. ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో ప్రేక్షకులు గుణపాఠం చెప్పడం ఖాయం. పిల్లలూ జర జాగ్రత్త. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: