రాష్ట్రంలో 27,500 గ్రామ సంఘ సహాయకులకు ( VAO ) స్మార్ట్ ఫోన్ల పంపిణీ
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- ( అమరావతి - ఇండియా హెరాల్డ్ ప్రత్యేక ప్రతినిధి ) :
గ్రామీణ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తోన్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ సంఘ సహాయకులకు ( VAO ) లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం తెలిపారు. రెండున్నర దశాబ్దాల క్రిందటే నాడు ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెలుగు పథకం ద్వారా పేదల ఇళ్లల్లో వెలుగులు నింపేందుకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారని మంత్రి చెప్పారు. డ్వాక్రా సంఘాల పటిష్టతకోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా సెర్ప్ సంస్థ ఏర్పాటు చేశారని మంత్రి గుర్తు చేశారు. నాడు చంద్రబాబు మదిలో వచ్చిన ఈ పథకం ద్వారా గ్రామాల్లో 90 లక్షల మంది మహిళలు 8.32 లక్షల స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా స్వయంకృషితో ఎదుగుతున్నారని మంత్రి తెలిపారు.
ఈ సభ్యుల నుంచి ప్రతి గ్రామంలోనూ ఒక సంఘ సహాయకురాలు ( VAO ) గా ఉన్న వారు తమ సంఘ సభ్యులకు శిక్షణ ఇవ్వడంతో పాటు బ్యాంక్ లింకేజీ, స్త్రీ నిధి, సీఐఎఫ్ లాంటి ఇతర ఆర్థిక పథకాల ద్వారా సభ్యులకు సాయం అందిస్తున్న నేపథ్యంలో వీరికి స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం అని మంత్రి తెలిపారు. ఈ సంఘ సహాయకులకు 2017లోనే తెలుగుదేశం ప్రభుత్వం గ్రామ సహాయకులకు తొలిసారి ట్యాబ్‌లు ఇవ్వగా... ఇప్పుడు కొత్తగా ఆండ్రాయిడ్ అప్లికేషన్లు రావడం, డేటా సేకరణ కోసం స్మార్ట్ ఫోన్లు కావాలని గ్రామ సంఘ సహాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు మంత్రి చెప్పారు.
ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా 27,500 స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసేందుకు అనుమతులు ఇచ్చారన్నారు. ఈ ఫోన్లు శ్యామ్‌సంగ్ ఏ06 మోడల్లో 6 జీబీ ర్యామ్ - 128 జీబీ స్టోరేజ్ - చార్జర్ - కేస్ - ప్రొడక్షన్ కవర్ - ఎండీఎం సాఫ్ట్వేర్ కలిగి ఉంటాయని... ఈ స్మార్ట్ ఫోన్లను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా పారదర్శక టెండర్లలో కొనుగోలు చేసినట్టు మంత్రి తెలిపారు.