ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డీఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేది అప్పుడేనా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. ఉగాది పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి భారీ నోటిఫికేషన్ను విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించి విద్యాశాఖలో ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది.
పాఠశాల విద్యాశాఖ రాష్ట్రంలోని ఖాళీల వివరాలను సమగ్రంగా సేకరించగా, సుమారు 3600 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ నోటిఫికేషన్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఊరటనిచ్చేలా, పరీక్షా సిలబస్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని అధికారులు స్పష్టం చేశారు. పాత సిలబస్ ప్రకారమే పరీక్ష నిర్వహించనుండటంతో అభ్యర్థులు తమ ప్రిపరేషన్ను ఎటువంటి గందరగోళం లేకుండా మరింత వేగవంతం చేసే అవకాశం కలిగింది.
మరోవైపు, ఈ ప్రత్యేక డీఎస్సీలో సుదీర్ఘ కాలంగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తగిన గుర్తింపు ఇచ్చేలా వారికి వెయిటేజీ కల్పించే అంశంపై ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోంది. ఇది అమల్లోకి వస్తే క్షేత్రస్థాయిలో బోధనా అనుభవం ఉన్న అభ్యర్థులకు పెద్ద పీట వేసినట్లవుతుంది. ఈ మేరకు నిబంధనల రూపకల్పనపై ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు.
గత కొంతకాలంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థుల కల సాకారం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉగాది పండుగ రోజే అధికారికంగా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో విద్యాశాఖలో సందడి నెలకొంది. ఈ ప్రకటనతో అటు అభ్యర్థులలోను, ఇటు వారి కుటుంబాల్లోను కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల వారీగా సమస్యలు, ఎమ్మెల్యేల పనితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్రజల ఇబ్బందులు, అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితులు, రాజకీయ అంశాలపై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.