ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

Reddy P Rajasekhar

▪️ సభ్యుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తాం: నూతన కార్యవర్గం

హైదరాబాద్: తెలుగు ఫిలిం & టీవీ డ్యాన్సర్స్, డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) 2025–2027 సంవత్సరానికి సంబంధించి ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతా దేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి యూనియన్ నాయకులు, డ్యాన్సర్లు, డ్యాన్స్ డైరెక్టర్లు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా తమ బాధ్యతలను స్వీకరించి ప్రమాణం చేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కార్యవర్గ సభ్యులకు అధ్యక్షురాలు సుమలతా దేవితో పాటు యూనియన్ సభ్యులు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతా దేవి మాట్లాడుతూ.. బైలా నిబంధనల ప్రకారమే నిర్ణయాలు తీసుకుని నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. యూనియన్ సభ్యులందరూ తమకు సహకరించాలని కోరారు.

ప్రధాన కార్యదర్శి జి. బాలకృష్ణ మాట్లాడుతూ.. చిరంజీవి గారికి తాము వ్యతిరేకమని గతంలో కొన్ని వార్తలు వచ్చాయని, అవి వాస్తవం కాదని స్పష్టం చేశారు. హెల్త్ ఇన్సూరెన్స్ కోసం తమ అసోసియేషన్‌కు ఆర్థికంగా సహాయం చేసిన చిరంజీవికి, రామ్ చరణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, వారికీ తాము జీవితాంతం రుణపడి ఉన్నామని తెలిపారు. సభ్యుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని, ప్రతి సభ్యుడికి హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.

నూతన కార్యవర్గం
ప్రధాన కార్యదర్శి: జి. బాలకృష్ణ
కోశాధికారి: ఇశ్రాయేలు పిట్ట (వడివేల్)
ఉపాధ్యక్షులు: జి. శంకర్
జాయింట్ సెక్రటరీ: పి. నాగమల్లేశ్వరరావు
ఆర్గనైజింగ్ సెక్రటరీ: జి. రవితేజ
కార్యవర్గ సభ్యులు: పి. కన్నయ్య, జి. వెంకన్న, ఎం. రమేష్, ఎం. రాములు, కె. నిరంజని, సిహెచ్. సాయిలక్ష్మి తదితరులు.
ఈ సందర్భంగా TFTDDA అభివృద్ధికి పునాది వేసిన వ్యవస్థాపకుల సేవలను సభ ప్రత్యేకంగా గుర్తుచేసుకుంది. వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ముక్కురాజు మాస్టర్, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి శ్రీ సోమరాజు, వ్యవస్థాపక కోశాధికారి శ్రీ ఎల్. వెంకటేశ్వరరావు అందించిన సేవలు, మార్గదర్శకత్వాన్ని సభ్యులు స్మరించుకున్నారు.

ప్రముఖ కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా మాట్లాడుతూ.. ఇప్పటివరకు జరిగిన విషయాలను పక్కనపెట్టి నూతనంగా ఎన్నికలకు వెళ్లామని, కొత్త కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. తాను మధ్యలో యూనియన్‌ను విడిచిపెట్టి వెళ్లినప్పటికీ తిరిగి యూనియన్‌లోకి వచ్చానని చెప్పారు. ఇకపై అందరం కలిసి కట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నిర్మాతలు, ఫిలిం ఛాంబర్‌తో పాటు సినీ పరిశ్రమలోని అన్ని వర్గాలు డ్యాన్స్ కళాకారుల అసోసియేషన్‌ను కలుపుకొని ముందుకు వెళ్లాలని కోరారు.

పీపుల్స్ మీడియా అధినేత, నిర్మాత టీ.జి. విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. దళారుల ద్వారా కాకుండా కళాకారులకు నేరుగా చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. తమ నిర్మాణ సంస్థ నుంచి తెలుగు డ్యాన్సర్లకు నేరుగా అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా నటుడు తాగుబోతు రమేష్ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. యూనియన్ సభ్యుల సంక్షేమం కోసం నూతన కార్యవర్గం సమష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు.

డ్యాన్స్ కళాకారులు, డ్యాన్స్ డైరెక్టర్లు, టీవీ, సినీ రంగానికి చెందిన డ్యాన్సర్ల సంక్షేమం కోసం TFTDDA నిరంతరం కృషి చేస్తోందని ప్రతినిధులు తెలిపారు. సభ్యుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సంక్షేమ కార్యక్రమాలకు నూతన కార్యవర్గం ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.
తెలుగు సినీ, టీవీ రంగంలో డ్యాన్స్ కళాకారుల పాత్రకు మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు, వారి సమస్యల పరిష్కారం, సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం సమష్టిగా పనిచేయాలని నూతన కార్యవర్గం సంకల్పించింది.

నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారంతో అసోసియేషన్‌లో నూతన ఉత్సాహం నెలకొంది. కార్యక్రమంలో TFTDDA సభ్యులు, సినీ రంగ ప్రముఖులు, కళాకారులు ఉత్సాహంగా పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీపుల్స్ మీడియా అధినేత, నిర్మాత విశ్వ ప్రసాద్, నటుడు తాగుబోతు రమేష్ హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: