ఏపీ: మహిళలకు నెలకు రూ.1500 ప్రకటన రాబోతోందా..?
ఏపీ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభించనుంది. తొలిరోజు గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభిస్తారు. ఆ వెంటనే బీఏసీ సమావేశం తర్వాత అందులో ప్రవేశపెట్టే వాటిపైన చర్చించి అలాగే పని దినాల పైన కూడా నిర్ణయం తీసుకుంటారు. 2025-26 బడ్జెట్ ను 14వ తేదీన ప్రవేశపెట్టేలా ఆలోచిస్తున్నారట. ఈ సమయంలో ఈసారి వ్యవసాయానికి ప్రత్యేకించి బడ్జెట్ కేటాయించబోతున్నట్లు వినిపిస్తున్నాయి. అలాగే బడ్జెట్లో అటు సంక్షేమం ఇటు అభివృద్ధికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేలా కసరత్తు చేస్తున్నారు.
సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం గురించి ప్రతిపక్షం ప్రశ్నలతో సంధిస్తోంది. ఈసారి బడ్జెట్లో ఈ పథకం అమలు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి నెల అర్హులైన మహిళలకు రూ. 1500 రూపాయల చొప్పున ప్రకటన చేసే అవకాశం ఉన్నది. అలాగే అమరావతి, పోలవరంతో సహా సంక్షేమ రంగాలకు కూడా పెద్దగానే నిధులను కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఈ బడ్జెట్ కూటమి ప్రభుత్వానికి చాలా కీలకంగా మారనున్నట్లు వినిపిస్తున్నాయి. అలాగే మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి వైసీపీ సభ్యులు కూడా హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరి సీఎం చంద్రబాబు ఆడబిడ్డ నిధి పథకం పైన ఏలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.