గాంధీ భవన్‌కు దూరం.. కాంగ్రెస్ వర్గాల్లో చర్చ: జానా రెడ్డి రిటైర్మెంట్ ఫిక్స్?

Amruth kumar
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడిగా, మాజీ మంత్రిగా పేరున్న కుందూరు జానా రెడ్డి ఇప్పుడు రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నప్పటికీ, ఇప్పుడు ఆయనను పూర్తిగా పక్కన పెట్టేసినట్లుగా కనిపిస్తోంది. దీంతో రాజకీయ 'పెద్దాయన' అయిన జానా రెడ్డి తన రాజకీయ జీవితానికి తానే ఫుల్‌స్టాప్ పెట్టుకున్నారన్న చర్చ తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఆశించిన రాజ్యసభ పదవి దక్కలేదా?.. జానా రెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం, వయసు (75 సంవత్సరాలు దాటింది) కారణంగా, ఇటీవల జరిగిన ఎన్నికల ముందు ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. తన వారసులైన కుమారులను రాజకీయాల్లోకి దించి, వారిని ఎదిగేలా ప్రోత్సహించారు.



ఈ క్రమంలో, తనకు రాజ్యసభ పదవి ఖచ్చితంగా దక్కుతుందని జానా రెడ్డి బలంగా ఆశించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయనకు పార్టీ నుంచి గౌరవప్రదమైన పెద్ద పదవి లభిస్తుందని అనుకున్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు కావస్తున్నా, ఆయనకు ఎలాంటి పదవీ దక్కలేదు. కనుచూపు మేరలో రాజ్యసభ పదవి దక్కే అవకాశం కనిపించకపోవడంతో జానా రెడ్డి నిరాశ చెందారని తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి అనేక మంది ఆశావహులు రాజ్యసభ రేసులో ఉండటం, వారికి కాకుండా తనకు పదవి దక్కే అవకాశం లేదని ఆయన 'ఫిక్స్' అయినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి వైఖరితో ఆవేదన! .. గతంలో, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జానా రెడ్డి ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనబోనని ప్రకటించారు.

 

అప్పుడప్పుడు పార్టీ సమావేశాలకు హాజరయ్యే ఆయన, ఇటీవల కాలంలో గాంధీ భవన్ వైపు కూడా రావడం లేదు. ఏడు పదుల వయసు దాటినా హుషారుగా ఉండే జానా రెడ్డి, తనను పార్టీ నాయకత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. కుమారుల రాజకీయ భవిష్యత్తు కోసం తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నా, కనీసం తన అనుభవాన్ని, సేవలను ఉపయోగించుకోవడానికి పార్టీ పెద్ద పదవి ఇచ్చి గౌరవిస్తుందని ఆయన ఆశించారు. కానీ, ఆ ఆశ ఫలించకపోవడంతో, ఇక రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవడానికే జానా రెడ్డి మొగ్గు చూపుతున్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ చరిత్రలో ఒక ఉద్దండుడిగా పేరున్న జానా రెడ్డి ఇలా నిశ్శబ్దంగా రాజకీయాలకు దూరం కావడం కాంగ్రెస్ పార్టీకి లోటుగా పరిగణించబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: