ఇండియా కూటమిలో ఊహించని ట్విస్ట్: సారథిగా అఖిలేష్ యాదవ్!
కాంగ్రెస్‌కు కష్టకాలం: ఎస్పీకి 'కీ' రోల్!
ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాత కూటమిలో కాంగ్రెస్ ప్రాధాన్యతను తగ్గించాలనే డిమాండ్ ఇతర పార్టీల నుంచి బలంగా వినిపిస్తోంది. యూపీలో ఏకంగా 37 ఎంపీ సీట్లతో ఎస్పీ రెండో అతిపెద్ద పార్టీగా నిలవడంతో, అఖిలేష్‌కి సారథ్య బాధ్యతలు అప్పగించాలని కోరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. యూపీ దేశ రాజకీయాలను మలుపు తిప్పే రాష్ట్రం కావడంతో, ఈ యువ నేత ఇప్పుడు ఇండియా కూటమికి నాయకత్వం వహించేందుకు ఉత్సాహంగా ఉన్నారని అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల వైపు అఖిలేష్ చూపు!
ఇటీవల తెలంగాణా పర్యటనకు వచ్చిన అఖిలేష్ యాదవ్, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు, విపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్ అధినేత కె.టి. రామారావును (కేటీఆర్‌ను) కూడా కలవడం రాజకీయంగా కీలకంగా మారింది. కేటీఆర్ పక్కనే ఉండగా అఖిలేష్ మాట్లాడుతూ... "కాలం ఎప్పుడూ ఒక్కలా ఉండదు, రాష్ట్రంలో మార్పులు వస్తాయి" అని వ్యాఖ్యానించడం ఆసక్తి రేపింది. కేటీఆర్ సైతం ఎస్పీ సాధించిన 37 ఎంపీ సీట్లను కొనియాడుతూ, ఎస్పీ తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్, వైసీపీ వైఖరి మారుతుందా?
ఇక్కడే అసలు చర్చ మొదలైంది. తెలంగాణలో కాంగ్రెస్‌తో నేరుగా పోరు ఉన్న కారణంగా బీఆర్‌ఎస్ ఇప్పటివరకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో చేరలేదు. ఒకవేళ కూటమి నాయకత్వం మారి, అఖిలేష్ యాదవ్ చేతికి వస్తే, బీఆర్‌ఎస్ తన 'తటస్థ వాదాన్ని' వీడి కూటమిలో చేరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అదే విధంగా, ఆంధ్రప్రదేశ్‌లో కూడా వైసీపీ పరిస్థితి దాదాపు ఇదే. కాంగ్రెస్‌తో రాజకీయ వైరాన్ని కొనసాగిస్తున్న జగన్ మోహన్ రెడ్డికి, అఖిలేష్ యాదవ్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి, అఖిలేష్ యాదవ్ సారథిగా వస్తే, ఇండియా కూటమిలో చేరేందుకు వైసీపీకి కూడా ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. మొత్తానికి, అఖిలేష్ యాదవ్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించడమే కాదు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలపైనా ఫోకస్ పెట్టినట్లు స్పష్టమవుతోంది.