అమరావతికి :కేంద్ర-రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం ఉన్నా ... రాజధాని బిల్లుకు లీగల్ చిక్కులు!
రాజధాని గుర్తింపు: ఏపీకి రాజధానిగా అమరావతిని అధికారికంగా గుర్తించాలి. ఉమ్మడి రాజధాని గడువు: ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు 2024, జూన్ 2తో ముగిసింది కాబట్టి, దానిని కొనసాగించడం లేదని స్పష్టం చేయాలి. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. విభజన చట్టం ప్రకారం, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 2024 జూన్ 2 వరకు మాత్రమే ఉంది. మరి ఇప్పుడు అమరావతిని రాజధానిగా గుర్తించే బిల్లును 2014 నుంచే అమలులోకి వచ్చేలా రూపొందించాలా? లేక 2024 జూన్ 2 తర్వాత నుంచి వర్తించేలా చేస్తారా? అనే అంశంపైనే న్యాయపరమైన చర్చ జరుగుతోంది. పాత తేదీల్లో బిల్లు ఎందుకు?..2014లోనే ఏపీ అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా తీర్మానించారు. 2015లో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. కేంద్రం అప్పుడే అమరావతికి నిధులు కేటాయించింది.
ఈ పనులన్నీ అధికారికంగా చెల్లుబాటు కావాలంటే, బిల్లు పాత తేదీ నుంచే అమలయ్యేలా ఉండాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. ఈ లీగల్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కేంద్రం ఏపీ ప్రభుత్వాన్ని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. రాజధాని విస్తీర్ణం ఎంత? సరిహద్దులు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? అనే అంశాలపై పూర్తి స్పష్టతతో కూడిన ప్రతిపాదనలను ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపించాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే, రాబోయే బడ్జెట్ సెషన్ సందర్భంగా పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉందని అంటున్నారు. అమరావతికి చట్టపరమైన హోదా దక్కితే, ఔటర్ రింగ్ రోడ్ వంటి నిర్మాణ పనులు ఊపందుకోవడంతో పాటు, ఉద్యోగాలు, పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమవుతాయి.