సూప‌ర్ టైమింగ్‌... లోకేష్ గ్రాఫ్ టాప్ లేపిందిగా... !

RAMAKRISHNA S.S.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ యువ మంత్రి నారా లోకేష్ ఇటీవల తీసుకున్న నిర్ణయం ఆయన రాజకీయ ప్రయాణంలో కీలక మలుపుగా మారింది. నేపాల్‌లో చోటుచేసుకున్న అల్లర్ల కారణంగా అక్కడ పర్యటనకు వెళ్లిన అనేక మంది భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు, ఇబ్బందుల్లో చిక్కుకుపోయారు. ఇలాంటి సున్నితమైన సమయంలో నారా లోకేష్ చూపిన చొర‌వ రాష్ట్ర, జాతీయ స్థాయిలో విశేషంగా గుర్తింపు పొందింది.
సాధారణంగా ఇలాంటి సమస్యలను సంబంధిత అధికారులకు అప్పగించి, తాను ఇతర కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. అదే సమయంలో ఆయనకు హాజరు కావాల్సిన పార్టీ ముఖ్యమైన "సూపర్ సిక్స్ – సూపర్ హిట్" కార్యక్రమం కూడా షెడ్యూల్‌లో ఉండేది. కానీ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఒక పెద్ద వ్యూహాన్ని అమలు చేశారు. నారా లోకేష్‌కి స్వయంగా ఈ బాధ్యతలను అప్పగించడం ద్వారా ఆయనను జాతీయ స్థాయిలో హైలెట్ చేయాల‌నే ఆలోచన ముందుంచారు.


అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో రోజంతా కూర్చొని నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారితో ఆన్‌లైన్ ద్వారా చర్చించడం, వారి సమస్యలు నేరుగా వినడం, వారికి భరోసా ఇవ్వడం నారా లోకేష్ చేసిన ప్రధాన చర్యలు. అంతేకాదు, వారిని తిరిగి స్వదేశానికి తీసుకురావడంలో ప్రభుత్వ స్థాయిలో జరుగుతున్న చర్యలను వివరించి, తనదైన శైలిలో వారిని ధైర్యపరచారు. ఒకవైపు పార్టీ కార్యక్రమాన్ని వదిలేసినా, ప్రజలకు అత్యవసరమైన అంశంపై దృష్టి పెట్టడం ద్వారా లోకేష్‌కు మంచి మార్కులు ప‌డుతున్నాయి. ఈ పరిణామం వల్ల తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ నారా లోకేష్‌పై చర్చ మొదలైంది.


దేశవ్యాప్తంగా ఉన్న మీడియా నేపాల్‌లో చిక్కుకున్న భారతీయుల సమస్యలపై దృష్టి పెట్టిన ఈ సమయంలో, ఒక రాష్ట్ర మంత్రి స్వయంగా రంగంలోకి దిగడం ఆయన ఇమేజ్‌ను మరింత బలపరిచింది. తెలంగాణలో ఈ సమస్యను అధికారులు మాత్రమే చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి స్థాయిలో నేరుగా జోక్యం చేసుకోవడం ప్రజల్లో లోకేష్ ప‌ట్ల మ‌రింత సానుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డేలా చేసింది. సహజంగానే ఇది నారా లోకేష్ రాజకీయ గ్రాఫ్‌ను పెంచింది. పార్టీ నేతల అభిప్రాయం ప్రకారం, ఈ సంఘటన ఆయనను కేవలం రాష్ట్ర నాయకుడిగా కాకుండా జాతీయ స్థాయి రాజకీయ నేతగా ప్రొజెక్ట్ చేసే అవకాశాన్ని కల్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: