మోదీ కులంపై రేవంత్ షాకింగ్ కామెంట్స్.. బీజేపీ సూపర్ కౌంటర్?
ప్రధానమంత్రి బీసీనా కాదా? అని అంశంపై ముఖ్యమంత్రి బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసురుతున్నాను.. రోజురోజుకూ రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పట్టుకోల్పోతున్న నేపథ్యంలో.. అసహనంతో రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారు.. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారానికి దూరమవడం, మొన్నటి ఢిల్లీ ఎన్నికల్లో డబుల్ హ్యాట్రిక్ గుండుసున్నాలతో అవమానం పాలవడాన్ని తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీలో, రేవంత్ రెడ్డిలో అసహనం కట్టలు తెంచుకుంటోంది.. ఆకాశం పైకి ఉమ్మేస్తే పెద్దోడిని అయిపోతానని రేవంత్ రెడ్డి అనుకుంటే అది ఆయనపైనే పడుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కిషన్ రెడ్డి విమర్శించారు.
స్వతహాగా బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా.. దేశంలో బీసీ అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న నాయకుడిగా ప్రధానమంత్రి గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోందన్న కిషన్ రెడ్డి..
సామాజిక సమరసత విషయంలో బీజేపీకి, నరేంద్రమోదీ గారికి.. రేవంత్ రెడ్డి సర్టిఫికెట్స్ అవసరం లేదన్నారు. బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించిన నరేంద్రమోదీ ప్రభుత్వమన్న కిషన్ రెడ్డి.. కేంద్రమంత్రివర్గంలో 27 మంది ఓబీసీలకు, 12 మంది ఎస్సీలకు, 8 మంది ఎస్టీలకు, ఐదుగురు మైనార్టీలకు అవకాశం కల్పించిన ఘనత నరేంద్రమోదీ గారిదన్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు.. ఇలా సామాజిక సమరసతతో పనిచేసిన సందర్భాలున్నాయా? అని రేవంత్ లెక్క చెప్పగలరా?.. మోదీ సర్కారు వచ్చిన తర్వాత నీట్ పరీక్షల్లో బీసీలకు 27% రిజర్వేషన్లు కలిపించినందునే.. ఇవాళ బీసీ తమ్ముళ్లు, చెల్లెళ్లకు ఉన్నతవిద్యాసంస్థల్లో ప్రవేశాలు లభిస్తున్నాయి.. ఒకటా రెండా? బీసీల అభ్యున్నతికోసం మోదీ ప్రభుత్వం చేస్తున్న పనుల జాబితాను నేను ఇవ్వగలనని కిషన్ రెడ్డి బదులిచ్చారు.