తిరుపతి విషాదం... ప్రమాదమా.. కావాలని చేసిందా...!
తిరుపతి ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందారు. అయితే ఈ విషాద ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణమన్న ఆరోపణలు ఎక్కువుగా వినిపిస్తున్నాయి. ఒక్కసారి గేట్లు తెరవడంతో తోపులాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు ఎక్కువ మంది చెబుతున్నారు. అయితే ఇందులో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల తప్పిదం కూడా ఉందన్న కామెంట్స్ కూడా బయటకు వస్తున్నాయి. అలాగే 1.20 లక్షల టోకెన్లు ఒకేరోజు జారీ చేయడం ఏంటన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. విడతల వారీగా టోకెన్లు ఇవ్వడమే కాకుండా ... వైకుంఠ ద్వార దర్శనం రోజుల సంఖ్య కూడా పెంచితే ఇంత భారీ సంఖ్యలో భక్తులు వచ్చే వారు కాదనే చర్చ కూడా నడుస్తోంది. అసలు ఒక్కరోజులో 1.20 లక్షల టోకెన్లు జారీ చేసి ... మరుసటి రోజు నుంచి నలభై వేల టోకెన్లు జారీ చేస్తామని ప్రకటించినా భక్తులకు అది చేరలేదని కూడా అంటున్నారు.
ఇక రోజుకు 70 వేల మందినే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతి ఇస్తామని చెప్పడంతో పాటు ద్వార దర్శనం రోజుల కుదింపు కూడా ఈ తొక్కిసలాటకు కారణమన్న విమర్శలు వస్తున్నాయి. ఆయాసంతో బాధపడుతున్న ఒక వృద్ధురాలికి సాయం చేయడానికి గేటు తెరవడంతోనే ఒక్కసారిగా భక్తులు తోసుకు వచ్చారట. ఇక కేవలం పది రోజులు మాత్రమే ద్వార దర్శనాలు ఉండటంతో టోకెన్లు దొరకవమేమోనన్న ఆందోళనతో భక్తులు తోపులాటకు పాల్పడినట్టు గా ఉంది. అలాగే పోలీసులు సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడం కూడా ఆరుగురు మృతి చెందడానికి ఒక కారణంగా కనిపిస్తోంది.
తొక్కిసలాటకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా భక్తులు కోరుతున్నారు. తొక్కిసలాటకు ఇద్దరు వ్యక్తులు కారణం అన్న కంప్లైంట్లు భక్తుల నుంచే రావడంతో వారు ఎవరు ? అన్న దానిపై పోలీసులు , టీటీడి అధికారులు ఆరా తీస్తున్నారు. ఘటనకు ఉద్దేశ్యపూర్వకంగా పాల్పడ్డారని అనుమానాలు కూడా వస్తున్నాయి. ఒక్కసారిగా భక్తులను ముందుకు నెట్టింది ఎవరు అన్న దానిపై అధికారులు సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు.