తిరుపతి తొక్కిసలాట.. మరణాలు.. చిన్న పొరపాటుతో పెద్ద ప్రమాదం.. !
వారంతా వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల శ్రీవారిని కనులారా సందర్శించి ఆ దేవుడి భక్తిలో తరించాలని అనుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తొక్కిసలాట జరగడంతో ఏకంగా ఆరుగురు భక్తులు అసువులు బాశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే చిన్న నిర్లక్ష్యం వల్లే పెద్ద ప్రమాదం జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. తిరుపతి లో పలు టోకెన్ జారీ కేంద్రాల వద్ద రోడ్లపై భారీ కేడ్లు ఏర్పాటు చేసి భక్తులను అనుమతించారు. అయితే బైరాగి పట్టెడలో అందుకు భిన్నంగా వ్యవహరించడం కారణమని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కౌంటర్ వద్ద బాధ్యతలు నిర్వహిస్తున్న డిఎస్పీ రమణ కుమార్ కు రహదారి పొడవునా భారీకేడ్లు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఏ ప్రమాదం జరగదు అన్న ధీమాతో డీఎస్పి రమణకుమార్ బారికేడ్లు ఏర్పాటు చేయలేదని తెలుస్తోంది. ఇక్కడ కేవలం డిఎస్పి రమణ కుమార్ నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.
దీనికి తోడు భక్తులను పార్కులో నుంచి ఒకేసారి లోపలకు అనుమతించడం వల్ల ఈ ప్రణాష్టం జరిగిందని ఆరోపణలు కూడా ఉన్నాయి. వారం రోజుల నుంచి కేంద్రాలను తిరుమల తిరుపతి దేవస్థానం .. స్థానిక పోలీసులు పరిశీలించి ఏర్పాట్లపై చర్చించారు. ఘోరంగా విఫలమైనట్టు భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే టోకెన్లు జారీ అంశంలో మొదటగా జీవకోనలో ని సత్యనారాయణపురం కేంద్రంలో తొక్కిసలాట జరిగింది. ఘటన జరిగిన మొదటి దశలోనే సమస్య గుర్తించిన పోలీసులు తిరుమల తిరుపతి దేవస్థానం వెంటనే అప్రమత్తమయింది. లోపలకు ప్రవేశించే వారిని అదుపు చేస్తూ ప్రతి 500 మందిని వేరు చేసి క్యూ లోకి అనుమతించారు. అక్కడికి చేరుకుని ప్రతి బృందానికి మధ్య కొంత సమయం తీసుకుని లోపలికి పంపాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎలాంటి తోపులాటలు లేకుండా లోపలికి వెళ్లారు. అదే ప్లానింగ్ ఇక్కడ మిస్ అయ్యింది. దీనికి తోడు బారీకేడ్లు లేక పోవడంతో పెద్ద ప్రమాదం జరిగింది.