ఆపరేషన్ సౌత్ మొదలు పెట్టిన బీజేపీ..? చంద్రబాబుకి కీలక బాధ్యతలు...?

Chakravarthi Kalyan

ఉత్తరాదిలో సత్తాచాటుతున్న బీజేపీ.. దక్షిణాదిలో ఎదగాలనే తన ఆశలను నెరవేర్చుకోవడంలో విఫలమవుతుంది.   కర్ణాటకలో గత ఏడాది అధికారం కోల్పోయిన తర్వాత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఒకవైపు జమిలి ఎన్నికల దిశగా సన్నాహాలు చేస్తూనే మరోవైపు దక్షిణాదిలో ఎన్డీఏ విస్తరణ ప్రణాళికను పదునెక్కించేలా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కీలక బాధ్యతలు అప్పగించారు.  


ప్రస్తుతం దక్షిణాదిలో టీడీపీ, జనసేన, జనతాదళ్ సెక్యులర్ పార్టీలు మాత్రమే ఎన్డీఏ భాగస్వామ పక్షాలుగా కొనసాగుతున్నాయి. తమిళనాడులోని అన్నా డీఎంకే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది.  వచ్చే ఎన్నికల నాటికి ఎన్డీఏలో మరిన్ని పార్టీలను కలుపుకోవడం, ఎన్డీఏ పక్ష పార్టీలను బలోపేతం చేసే దిశగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు ప్రణాళిక రచిస్తున్నారు.  


దీనికోసం ముగ్గురు కేంద్ర మంత్రులతో ఓ సమన్వయ కమిటీని నియమించారు. ఈ కమిటీతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టచ్ లో ఉంటూ ఎన్డీఏ బలోపేతానికి తీసుకోవాల్సిన నిర్ణయాలను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకి వివరిస్తారు. ఎన్డీఏ బలోపేతానికి అవసరమైన వ్యూహాలను చంద్రబాబు అమలుచేస్తే, ఆయా రాష్ట్రాల్లో ప్రచార కార్యక్రమాల బాధ్యతను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చూస్తారని చెబుతున్నారు.  



చంద్రబాబుతో ఎప్పటికప్పుడు సంప్రదస్తూ కీలక సూచనలు చేసేందుకు ముగ్గురు కేంద్ర మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.  కింజరాపు రామ్మోహన్ నాయుడుతోపాటు భూపేంద్ర యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్ ఉంటారు.  వీరు దక్షిణాది రాష్ట్రాల సమస్యలు, వాటి పరిష్కారాలను సూచిస్తారు.   వీరు దక్షిణాది రాష్ట్రాల్లో ఏ విధంగా విస్తరణ ప్రణాళికలు ఉండాలి? అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సూచనలివ్వాల్సి ఉంటుంది. ఇలా రానున్న రెండుమూడేళ్లలో దక్షిణాదిలో బలపడాలనేది బీజేపీ పెద్దల వ్యూహాంగా చెబుతున్నారు.


ఈ సారి బీజేపీ టీడీపీ, జేడీయూ వంటి భాగస్వామ్యపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది.  జమిలి నిర్వహించినా తమ అధికారానికి ఎలాంటి ప్రమాదం రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది.  దక్షిణాదిలో ఇప్పుడిప్పుడే తెలంగాణలో బలం పెంచుకుంటోంది.   ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి రావాలంటే దక్షిణాదిలో బీజేపీ సొంతంగా ఎదగడంతోపాటు తమ భాగస్వామ్య పక్షాలైన ఎన్డీఏ పార్టీలు బలపడాల్సిన పరిస్థితి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: