వైసీపీ నిర్ల‌క్ష్యం.. బాబుకు త‌ప్ప‌ని తిప్ప‌లు..!

RAMAKRISHNA S.S.
ఏపీ సీఎం చంద్ర‌బాబు విజ‌న్ ఉన్న నాయ‌కుడిగా పేరు గ‌డించారు. సంప‌ద సృష్టికి కేరాఫ్‌గా కూడా నిలి చారు. సైబ‌రాబాద్ ద్వారా.. హైద‌రాబాద్ ఆదాయాన్ని, అమ‌రావ‌తి ద్వారా ఏపీ ఆదాయాన్ని పెంచాల‌న్న ల‌క్ష్యంతో ఆయ‌న అడుగులు ముందుకు వేశారు. అమ‌రావతి నిర్మాణాలు ముందుకు సాగుతున్నాయి. అయితే.. ఎటొచ్చీ.. అప్పులు మాత్రం చేయ‌క త‌ప్ప‌డం లేదు. గ‌తంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. ఇప్పుడు చంద్ర‌బాబు స‌ర్కారు కూడా.. అప్పులు చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నాయి.

అప్పు చేయ‌డం త‌ప్పుకాదు.పైగా.. ఇప్పుడు పెరిగిన ద్ర‌వ్యోల్బ‌ణం, ఖ‌ర్చులు, ప‌థ‌కాలు వంటివాటిని పోల్చుకుంటే.. అప్పులు చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ప‌రిస్థితే ఏర్ప‌డింది. కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన ఈ 130 రోజుల్లో.. ఇప్ప‌టి వ‌ర‌కు 70 వేల కోట్ల అప్పులు చేయ‌డం చ‌ర్చ‌కు దారితీసింది. పెరిగిపోయిన పింఛ‌న్లు.. ఉద్యోగుల వేత‌నాలను స‌కాలంలో ఇవ్వ‌డం వంటివి ఇప్పుడు స‌ర్కారుకు గుదిబండ‌గా మారాయి.

సెల్ఫ్ రెలియ‌న్స్ వంటి అమ‌రావ‌తిని గ‌త ఐదేళ్ల‌లో డెవ‌లప్ చేసి ఉంటే.. రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప‌న్నుల రూపంలో ఆదాయం వ‌చ్చేది. కానీ, గ‌త వైసీపీ ప్ర‌భుత్వం అలా చేయ‌లేదు. ఇక‌, రాష్ట్ర ఆదాయాన్ని పెంచే మార్గాల‌ను కూడా ప‌టిష్టంగా ముందుకు తీసుకు వెళ్ల‌లేక‌పోయిన ప‌రిస్థితి కూడా ఉంది. దీంతో ఏపీ ఆదాయ వ‌న‌రులు స‌న్న‌గిల్లాయ‌ని అంటారు. దీంతో ఇప్పుడు బాబు కూట‌మి స‌ర్కారు కూడా ఎన్ని చెప్పినా.. అప్పులు చేయ‌క త‌ప్ప‌డం లేదు.

తాజాగా మూడు వేల కోట్ల రూపాయ‌ల కోసం రిజ‌ర్వ్ బ్యాంకు ద‌గ్గ‌ర ఇండెంట్ పెట్ట‌డం గ‌మ‌నార్హం. ఇవి మంగ‌ళ‌వారం ఆక్ష‌న్‌కు కూడా వ‌చ్చాయి. ఏపీ మూడు వేల కోట్ల రూపాయ‌ల మేర‌కు ఇండెంట్ పెట్టింది. దీనిలో 1000 కోట్ల‌ను 23 ఏళ్ల వ‌ర‌కు, మ‌రో 1000 కోట్ల‌ను 19 ఏళ్ల వ‌ర‌కు, ఇంకో 1000 కోట్ల‌ను 15 ఏళ్ల వ‌ర‌కు పెట్టి తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రో మూడు రోజుల్లోనే సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్లు ఇవ్వాల్సి రావ‌డం.. ఉద్యోగుల‌కు వేత‌నాలు వంటివి ఉన్న నేప‌థ్యంలో స‌ర్కారుకు అప్పులు త‌ప్ప‌క పోవ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: