కూట‌మిలో బాలినేని చిచ్చు.. గీత దాటిన టీడీపీ నేత‌లు..!

RAMAKRISHNA S.S.
ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని కీల‌కమైన ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు వేడెక్కాయి. అది కూడా కూట‌మిలో అంత‌ర్గ‌త చిచ్చుకు దారితీసేలా టీడీపీ నాయ‌కులు వ్యాఖ్య‌ల‌తో రెచ్చిపోయారు. ఈ ప‌రిణామా లు.. పార్టీల మ‌ధ్య స‌ఖ్య‌త‌పై ప్ర‌భావం చూపించేలా ఉంద‌న్న అభిప్రాయం కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. ఇటీవ ల ఒంగోలులో ఓడిపోయిన వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి.. వైసీపీకి గుడ్‌బై చెప్పారు. అనంత‌రం జ‌న‌సేన‌లో చేరారు.

కానీ, ఈ ప‌రిణామాల‌ను ఒంగోలు టీడీపీనాయ‌కులు జీర్ణించుకోలేక పోతున్నారు. వాస్త‌వానికి ఒంగోలులో జ‌న‌సేన పార్టీకి బ‌ల‌మైన కేడ‌ర్ అంటూ ఏమీలేదు. దీంతో బాలినేని ద్వారా.. ఇక్క‌డ బ‌ల‌ప‌డాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు ఆమంచి స్వాములు జ‌న‌సేన‌లో ఉన్నా.. ఆయ‌నకు చీరాల టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో జ‌న‌సేన నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఫ‌లితంగా ప్ర‌కాశంలో జ‌న‌సేన‌కు నాయ‌కుల కొర‌త వెంటాడుతోంది.

ఈ క్రమంలోనే బాలినేనిని ప‌వ‌న్ ఆహ్వానం ప‌లికారు. కానీ, అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు.. ఏళ్ల త‌ర‌బ‌డి ఉన్న వైరాల‌తో బాలినేని జ‌న‌సేన‌లో చేర‌డంపై టీడీపీ నాయ‌కులు ముఖ్యంగా ఎమ్మెల్యే దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్ అనుచ‌రులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. అయితే.. ఇక్క‌డ వారిలో వారు ఏమ‌నుకున్నా.. ఇబ్బంది ఉండే ది కాదు. కానీ, బ‌హిరంగ స‌భ‌లు పెట్టుకుని.. జ‌న‌సేన‌పైనా.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌పైనా విమ‌ర్శ‌లు చేయ‌డం ఇప్పుడు వివాదంగా మారింది.

ఎమ్మెల్యే దామ‌చ‌ర్ల వ‌ర్గీయుడు, టీడీపీ ముఖ్య నాయ‌కుడు శ‌శిభూష‌ణ్ ఏకంగా.. జ‌న‌సేనను టార్గెట్ చేస్తూ.. బాలినేని వంటి వ్య‌క్తిని పార్టీలో చేర్చుకునే ముందు.. త‌మ‌ను సంప్ర‌దించాల‌న్న ఇంగిత జ్ఞానం ఉండొద్దా.. అంటూ.. జన‌సేనానిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. మీరు సొంత‌గా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌లేద‌ని.. సంకీర్ణంలో మీరు ఒక భాగ‌మ‌న్న విష‌యాన్ని గుర్తించాల‌ని ఆయ‌న రుస‌రుస‌లాడారు. మ‌రిన్ని తీవ్ర వ్యాఖ్య‌లు కూడా చేశారు. ప్ర‌స్తుతం ఈవివాదం ఇటు ప‌వ‌న్‌కు, అటు సీఎం చంద్ర‌బాబుకు చేరింది.

పార్టీ ప‌రంగా.. చ‌ర్య‌లు తీసుకునేందుకు చంద్ర‌బాబు సిద్ధ‌మ‌య్యార‌ని తెలుస్తోంది. ఒక‌వైపు క్షేత్ర‌స్థాయిలో కూట‌మి పార్టీలు స‌ఖ్య‌త‌గా ఉండాల‌ని పిలుపునిస్తున్న స‌మ‌యంలో ఇలా.. వ్య‌క్తుల‌ను టార్గెట్ చేసుకుని కూట‌మిలో చిచ్చుకుప్ర‌య‌త్నించే వారిపై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని.. తాజాగా టీడీపీ అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీనివాస‌రావు కూడా చెప్ప‌డం గ‌మ‌నార్ష‌హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: