వైసీపీ నుంచి అది పాయే.. పాయే...!
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పద్మశ్రీ నేరుగా టీడీపీ తర్థం పుచ్చుకోనున్నారు. ఆమెతో పాటు ప్రస్తుతం కొందరు పార్టీ మారి..సైకిల్ ఎక్కనున్నారు. ఇక, ఇప్పటికే పద్మశ్రీ భర్త ప్రసాదరావు.. కొన్నిరోజుల కిందటే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈ ఫ్యామిలీకి అప్పటి సీఎం జగన్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. పలువురు పోటీలో ఉన్నా కూడా.. కాపుల ను ఆకర్షించుకునే క్రమంలో పద్మశ్రీకి చైర్ పర్సన్ పదవిని అప్పగించారు. అయితే.. రాజకీయాలు రాజకీయాలే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. పార్టీ ఓటమి పాలయ్యాక పద్మశ్రీ కుటుంబం మార్పు దిశగా అడుగులు వేసింది.
ఈ క్రమంలో తొలుత ప్రసాదరావు.. తర్వాత పద్మశ్రీ (నేడో - రేపో ) పార్టీ మారనున్నారు. దెందులూరు నియోజకవర్గంలోనిపెద్దపాడు నుంచి జెడ్పీటీసీగా పద్మశ్రీ విజయం దక్కించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 48 స్థానాలకు గాను 46 వైసీపీ దక్కించుకుం ది. మిగిలిన రెండు స్థానాలను(వీరవాసరం, ఆచంట) టీడీపీ,జనసేన చెరకటి దక్కించుకున్నాయి. అయితే.. ఇప్పుడు వైసీపీ దూకుడు తగ్గడం.. టీడీపీ కూటమి హవా పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జంపింగుల మాదిరిగానే పశ్చిమ జెడ్పీ కూడా అదే బాట పట్టింది. అయితే.. ఇక్కడ చిత్రం ఏంటంటే ఈ వ్యవహారం గత వారం నుంచి జరుగుతున్నా వైసీపీ అధినేత మాత్రం మౌనంగా ఉండడం.. స్థానిక నాయకులు కూడా పట్టించుకోకపోవడం గమనార్హం.