ఎమ్మెల్సీ బొత్స సైలెంట్... వైసీపీలో ఏం జరుగుతోంది...!
అనూహ్యంగా వరించిన ఎమ్మెల్సీ.. ఆపై మండలిలో ప్రతిపక్ష నేత హోదా కూడా రావడంతో బొత్స రెచ్చిపోతారని.. ప్రభుత్వాన్ని పదే పదే ఇరకాటంలో పెడతారని అందరూ అనుకున్నారు. అప్పిరెడ్డిని తప్పించిన జగన్ బొత్సకు మండలి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడంతో వైసీపీలో బొత్స ఇక నెంబర్ 2 అయిపోతారన్న ప్రచారం ఆ పార్టీలోనే గట్టిగా జరిగింది. అయితే అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ బొత్స సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఎమ్మెల్సీ అయ్యాక బొత్స మీడియా ముందుకు వచ్చి చాలా రోజులు అయ్యింది.
ఇటీవల బెజవాడ వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బొత్సను బాధితులు నిలదీశారు. వదరలు వచ్చాక ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చారు.. ఏ మొఖం పెట్టుకుని వచ్చారని బాధితులు ప్రశ్నల వర్షం కురిపించడంతో బొత్స ఏం చెప్పలేని పరిస్థితి. అప్పటి నుంచి బొత్స మీడియా ముందుకు వస్తే నాకు లేనిపోని తలనొప్పులు వస్తాయని డిసైడ్ అయిపోయారు... అందుకే ఆయన సైలెంట్ అయిపోయారు.
జగన్‌తో కలిసి బొత్స పార్టీని కష్టకాలంలో ముందుకు నడిపిస్తారని అనుకుంటే ఆయన సైలెంట్ అవ్వడం పార్టీ వర్గాల్లోనూ చర్చగా మారింది. ఈ టైంలో రిస్క్ చేసి వాయిస్ పెంచితే ఇబ్బందులు తప్పవని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ పుంజుకుంటుందన్న ఆశ కూడా బొత్సకు లేకపోవడం వల్లే సైలెంట్ అయ్యాడని అంటున్నారు. ప్రజల నుంచి నిలదీతలు ఎక్కువైతే ప్రజల్లో మరింత చులకన అవుతామన్న భయం కూడా ఉండడంతో పాటు మరీ ముఖ్యంగా... జగన్ అధికారంలో ఉన్నప్పుడు తన సొంత మేనళ్లుడు.. విజయనగరం జడ్పీచైర్మన్ మజ్జి శ్రీనుకు బాగా ప్రయార్టీ ఇవ్వడం లాంటి విషయాలు బొత్సను నొచ్చుకునేలా చేశాయంటున్నారు. అందుకే బొత్స రాష్ట్ర సమస్యలు పక్కన పెట్టేసి తన సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో పార్టీని ఫికప్ చేసుకుంటే చాలన్న నిర్ణయానికి వచ్చేశారట.