దేశానికే అన్నం పెట్టే రైతన్నకు వరి పంట పండగ కాదు దండగేనా.?

Pandrala Sravanthi
- తెలంగాణలో అత్యధికంగా పెరిగిన వరి సాగు..
- సాగు ఎక్కువ మద్దతు ధర తక్కువ..
- అంతగా మార్కెట్ లేని వరి పంట..


 సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా పండించే పంటలు ఏంటంటే  అది వరి అని చెప్పవచ్చు. అలాంటి ఈ పంట సాగు  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు ఎక్కువగా ఉండేది కాదు. ఎప్పుడైతే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ప్రాజెక్టులు పూర్తయ్యాయో అప్పటి నుంచి రైతులు ఎక్కువగా కష్టం లేని పంట వరి అనే ఆలోచన చేసి ఆ పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ఎక్కువగా తింటారు తప్ప ఇతర రాష్ట్రాల్లో పెద్దగా తినరు. కాబట్టి వరి పంటకు అంతగా మార్కెటింగ్ లేకపోవడంతో ఈ పంట సాగు తగ్గించాలని ప్రభుత్వాలు కూడా ప్రచారం చేస్తున్నాయి. 1960 లో వచ్చినటువంటి హరిత విప్లవం ద్వారా దేశంలో ఆహార భద్రత తీసుకువచ్చేందుకు రెండు తెలుగు రాష్ట్రాలను ఎంచుకొని వరిని పండించాలని ప్రభుత్వాలు ప్రోత్సహించాయి. ఆ టైంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నీటిపారుదలు ఎక్కువగా లేదు. అప్పుడు పంజాబ్, హర్యానా నుంచి వచ్చే బియ్యమే మనకు  ఆహారంగా ఉండేది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాజెక్టులు కట్టి సబ్సిడీలు ఇచ్చి వరి పంటను ప్రోత్సహించారు.

దీంతో రైతుల్లో అవగాహన పెరిగి వరి పంట సాగు కూడా విపరీతంగా పెరిగిపోయింది. 1995 తర్వాత పరిస్థితులు మారడం మొదలయ్యాయి. పంజాబ్ నుంచి బియ్యాన్ని తీసుకురావడం మానేసింది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. దీంతో వరి సేకరణ వికేంద్రీకరణగా రెండు తెలుగు రాష్ట్రాలు మారిపోయాయి.  దీంతో వరి పంట మన రాష్ట్రాల్లో ఉపయోగించే దానికంటే ఎక్కువ దిగుబడి వస్తోంది. ఎక్కడ చూసినా గోడౌన్ లు నిండిపోయి  కనీసం ప్రభుత్వం కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. 52,78,736 ఎకరాల వరి పంట సాగు చేస్తున్నారు. కానీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి కొనుగోలు చేస్తున్న రైతులకు మాత్రం సరైన గిట్టుబాటు ధర అందడం లేదు. కనీసం ఎకరానికి అన్ని పెట్టుబడులు పోను 15 నుంచి 20,000 కూడా మిగలడం లేదు. ఈ విధంగా వరి సాగు ప్రభుత్వాలు వద్దని చెప్పిన రైతులు మాత్రం ఈజీగా క్రాప్ వస్తుంది కాబట్టి ఇదే పంటను ఎంచుకుంటున్నారు.
 
 వరి వద్దు ప్రత్యామ్నాయ పంటలు ముద్దు:
 వరి పంటకు బదులు  పామాయిల్,డ్రాగన్ ఫ్రూట్, మొక్కజొన్న,కంది, వేరుశెనగ వంటి పంటలను ఎక్కువగా పండించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అంతేకాదు వాటికి సబ్సిడీలు కూడా అందిస్తూ ప్రోత్సహిస్తున్నాయి. కానీ రైతులు మాత్రం వరి పంటే వేసి తక్కువ లాభాలైన తీసుకుంటున్నారు కానీ పంట మార్పిడి మాత్రం చేయడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: