రేవంత్ రెడ్డి హా మజాకానా! బీఆర్ఎస్ కు ఊహించని ట్విస్ట్?
బీఆర్ఎస్ కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రివర్స్ షాక్ ఇచ్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హత విషయమై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు అసెంబ్లీ సెక్రటేరియట్ ను ఆదేశించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో బీఆర్ఎస్ నేతలంతా హ్యాపీగా ఉన్నారు. ముగ్గురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు పడినట్లే అని వారంతా ఫిక్స్ అయిపోయారు.
ఫిరాయింపులను తప్పు పడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ ప్రభుత్వానికి చెంపపెట్టు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి కోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని సూచన చేసింది. ఫిరాయింపులపై గతంలో కూడా ఇలాంటి తీర్పులే ఇచ్చిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో బీఆర్ఎస్ కూడా కోర్టు ఇచ్చిన ఆదేశాలు, సూచనలను ఏమాత్రం పట్టించుకోలేదు.
ఇప్పుడు ఉదయం కోర్టు ఉదయం ఇలా తీర్పు చెప్పిందో లేదో సాయంత్రం గడ్డం ప్రసాద్ కుమార్ ఒక ఫిరాయింపు ఎమ్మెల్యేకు అసెంబ్లీ తరఫున నియమించిన కీలక కమిటీలో కీలక పదవి అప్పజెప్పారు. అసెంబ్లీ తరఫున స్పీకర్ మూడు కమిటీలను నియమించారు. ఇందులో పబ్లిక్ అకౌంట్స్, ఎస్టిమేట్ , పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. వీటిలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అత్యంత కీలకమైంది. ఎందుకంటే ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయిని ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలన చేస్తోంది.
ఇంతటి కీలక కమిటీకి ప్రతిపక్ష పార్టీ నేత ఛైర్మన్ గా ఉంటారు. అయితే తాజా నియామకంలో స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కాకుండా కాంగ్రెస్ లోకి ఫిరాయించిన అరెకపూడి గాంధీకి కట్టబెట్టారు. అంటే సాంకేతికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా.. ఆయన ఉంటున్నది మాత్రం కాంగ్రెస్ లోనే. ఇది బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన బిగ్ షాక్ గా పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పీకర్ కార్యాలయం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.