జ‌న‌సేన‌లో ఆమె దే ' లోకం ' .. ఆమె చెప్పిందే వేదం.. !

RAMAKRISHNA S.S.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో జనసేన గెలిచిన ఏకైక సీటు నెల్లిమర్ల. ఇక్కడి నుంచి 2019లో కూడా జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయిన మహిళ నేత లోకం మాధవికి మరోసారి టికెట్ ఇచ్చారు. మామూలుగా ఆమెకు జనసేన నెల్లిమర్ల సీటు ఇచ్చిన వెంటనే కచ్చితంగా జనసేన ఓడిపోయే తొలి సీటు నెల్లిమర్లే అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే కూటమి ప్రభంజనంలో లోకం మాధవి ఇక్కడ నుంచి భారీ మెజార్టీతో గెలిచారు. ఈ సీటు విషయంలో టిడిపి సీనియర్ నేతలు చాలామంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చివరికి కూటమి మిత్ర ధర్మాన్ని పాటించి మద్దతు ఇచ్చి మాధ‌వి ని భారీ మెజార్టీతో గెలిపించారు. దీంతో భారీ విజయం ఆమెతో సొంతం అయ్యింది.

ఇంకా చెప్పాలి అంటే జనసేన నుంచి గెలిచిన మహిళ ఎమ్మెల్యేగా మాధవి రికార్డులకు ఎక్కారు. అయితే గెలిచిన తర్వాత లోకం మాధవి వన్ మ్యాన్ షో చేస్తున్నారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీలో మొదటినుంచి ఉన్నవారికి పెద్దపీట వేయ‌కుండా ... ఆమె తన చుట్టూ ఉన్న కోటరికే ప్రాధాన్యత ఇస్తున్నారు అని ద్వితీయశ్రేణి నాయకులు పాపోతున్న పరిస్థితి. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో నామినేటెడ్ పెదవుల మీద ఆశలు పెట్టుకున్న సీనియర్లు అవి తమకు అందుతాయా ? దక్కుతాయా లేదా అని కూడా లోలోన మదన పడుతున్నారని ప్రచారం సాగుతోంది.

ఎమ్మెల్యే మాధవి ఎవరిని పట్టించుకోకపోవడంతో ... కొంతమంది నేత‌లు పూర్తిగా సైలెంట్ అయిపోయారని అంటున్నారు. ఇక కీలక పదవులు కానీ సీనియర్లకి ఇస్తే వారు తనకు ఎక్కడ పోటీ అవుతారు అన్న ఉద్దేశంతో మాధవి ఆచితూచి వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఆమె తనదైన శైలీలో చేస్తున్న ఈ రాజకీయం చూసినవారు ఆమె వ్యవహార శైలిని పూర్తిగా తప్పుపడుతున్నారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎవరి అవసరము లేదు అన్నట్టుగా మాధవి తీరు ఉండడం పట్ల పార్టీలో నిరసన వ్యక్తం అవుతుందని అంటున్నారు.

పార్టీలో చురుకుగా ఉన్నవారు పార్టీని అభిమానించేవారు సైతం తమకు ప్రోత్సాహం లేకపోతే ఎలా రాజకీయాల్లో కొనసాగుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇవన్నీ చూస్తుంటే నెల్లిమర్ల జనసేనలో ఆమీదే లోకం ... ఆమెదే రాజ్యం అన్న చర్చలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనిని పార్టీ అధినేత పవన్ స్వయంగా చక్కదిద్దాలని జిల్లా జనసేన నేతలు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: