మంత్రి పదవి ఆశించి బంగపడ్డ కోటంరెడ్డి.. టీడీపీ లో అయినా ఆ కోరిక తీర్చుకుంటారా..?
* జగన్ కి నమ్మిన బంటుగా వున్న కోటంరెడ్డి
* రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచినా దక్కని మంత్రి పదవి
* వైసీపీని వీడి టీడీపీలో చేరిన అదే పరిస్థితి…
* కోటంరెడ్డికి మంత్రి అయ్యే ఛాన్స్ దక్కేనా..?
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి…ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కీలక రాజకీయనేతగా మంచి గుర్తింపు పొందారు..కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరంభంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా ఉంటూ యువజన కాంగ్రెస్‌లో కీలక స్థానానికి ఎదిగారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ వెంట నడిచిన మొదటి తరం నాయకుల్లో ఆయన ఒకరు. పీసీసీ కార్యదర్శిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ వెంట ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు.2014, 2019 ఎన్నికల్లో వరుసగా కోటంరెడ్డి విజయభేరి మ్రోగించారు.అయితే ఆయన విపక్షంలో ఉన్నా అధికారంలోకి వచ్చినా కూడా తనదైన దూకుడు శైలితోనే ఎంతగానో ఆకట్టుకున్నారు..తన నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం మురికి కాలువలో దిగి నిరసన తెలియజేసిన నిజమైన నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అయితే వైఎస్ జగన్ క్యాబినెట్‌లో తనకు బెర్త్ దక్కుతుందని శ్రీధర్ రెడ్డి ఎంతో ఆశించారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో యాక్టివ్‌గా పని చేసినందున, తనకు మంత్రి పదవి కచ్చితంగా వస్తుందని శ్రీధర్ రెడ్డి భావించారు. కానీ ఆయనకు మంత్రి పదవి మాత్రం అందని ద్రాక్షలానే మిగిలిపోయింది. అయితే ఆ తరువాత మంత్రివర్గంలో మార్పులు చేసినప్పుడు కూడా ఆయనకు పదవి రాలేదు.ఈ విషయం పై నాడు ఆయన బహిరంగంగానే ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేసారు..దీనితో ‘గడపగడప మన ప్రభుత్వం’ కార్యక్రమం గురించి ఆయన అంతగా పట్టించుకోలేదు.దీనితో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తన కార్యకర్తలతో మాట్లాడినట్టుగా చెబుతున్న ఆడియో లీక్ ఒకటి బయటకు వచ్చింది.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెబుతున్నట్లుగా ఆ ఆడియోలు ఉండటం ఆ సమయంలో సంచలనం సృష్టించింది... ఆ సమయంలో తన ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని శ్రీధర్ ఆరోపించారు. అందుకే తాను 11 సిమ్‌లు వాడుతున్నానని తెలిపారు. దీనికి డీజీపీ సమాధానం చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం చర్యలను కోటంరెడ్డి తీవ్రంగా విమర్శించారు.దీనితో వైసీపీ పార్టీ కోటంరెడ్డిని సస్పెండ్ చేసింది.. కోటంరెడ్డి టీడీపీ లో చేరి వైసీపీ పార్టీ పై తీవ్ర విమర్శలు చేసారు.. 2024 ఎన్నికలలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే స్థానానికి టీడీపీ తరుపున పోటీ చేసి ఘనవిజయం సాధించారు.. ఎన్నడూ లేని విధంగా నెల్లూరులో కూటమి ఘనవిజయం సాధించేందుకు కోటంరెడ్డి కృషి చేసారు.. ఫలితం వైసీపీకి పెద్ద దెబ్బ తగిలింది.
తాజా ఎన్నికల్లో నెల్లూరు 10 సీట్లు కూటమి వశం అయ్యాయి. అనుకున్న విధంగానే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది.. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు.. ముందు నుంచి మంత్రి పదవిపై ఆసక్తి వున్న కోటంరెడ్డి మంత్రి పదవి వస్తుందని ఆశించాడు.. కానీ ఆ కోరిక తీరలేదు.. ప్రస్తుతం ఎమ్మెల్యే గా వున్న కోటంరెడ్డికి నామినేటెడ్ పదవి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందని సమాచారం.. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుంది…