సెల్ఫ్ డిఫెన్స్‌లో చంద్ర‌బాబు... అస‌లు రీజ‌న్ ఇదే..!

RAMAKRISHNA S.S.
విజయ‌వాడ‌లో పోటెత్తిన వ‌ర‌ద‌లు.. బుడ‌మేరు పొంగు ఆగ‌క‌పోవ‌డం.. బాధితుల క‌ష్టాలు.. ఐదు రోజులు అయిపోయినా తీర‌క‌పోవ‌డంతో ప్ర‌భుత్వంపై భారీ ఎత్తున ఒత్తిడి పెరుగుతోంది. ఒక‌వైపు.. ల‌క్ష‌ల కొద్దీ ఆహార ప్యాకెట్లు స‌ర‌ఫ‌రా చేస్తున్నా.. వేల లీట‌ర్ల మంచినీటి బాటిళ్లు స‌ర‌ఫ‌రా చేస్తున్నా.. అవి క్షేత్ర‌స్థాయిలో స‌గం మంది బాధితుల‌కు కూడా చేరడం లేదు. దీనిని ఎవ‌రూ ప్రొజెక్టు చేయాల్సిన అవ‌స‌రం లేకుండానే ప్ర‌జ‌ల కు తెలుస్తున్నాయి.

ర‌హ‌దారుల వెంబ‌డి గుట్టలు గుట్ట‌లుగా ప‌డి ఉన్న ఆహార ప్యాకెట్ల బ‌స్తాలు.. అధికారుల నిర్ల‌క్ష్యానికి, క్షేత్ర‌స్థా యిలో సిబ్బంది నిర్ల‌క్ష్యానికి తార్కాణంగా మారాయి. దీనికితోడు.. వ‌ర‌ద త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్టే ప‌ట్టి మ‌రోసారి పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌లు భ‌యం గుప్పిట్లోనే బ‌తుకుతున్నారు. ఇంకోవైపు.. ఎక్క‌డ‌బ‌డితే అక్క‌డ శ‌వాలు నీటిలో తేలుతున్నాయి. మ‌ట్టిదిబ్బ‌ల్లోనూ క‌నిపిస్తున్నాయి. ఇది స‌ర్కారుకు మ‌రింత సెగ పెడుతోంది. ఈ ప‌రిణామాల‌తో తాము ఎంత చేస్తున్నా.. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల‌కు ఉప‌శ‌మ‌నం క‌ల్పించ‌లేక పోతున్నామ‌నే ఆవేద‌న చంద్ర‌బాబులో క‌నిపిస్తోంది.

దీంతో ఆయ‌న ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డారు. త‌న అనుభ‌వాన్ని రంగ‌రించి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నాన‌ని చెబుతున్నారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో తిరుగుతున్నారు. కేంద్రం నుంచి ఆర్మీని తెప్పించారు. అయి నా.. బాధితుల క‌న్నీళ్లు తుడ‌వ‌లేక పోతున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో చంద్ర‌బాబు అస‌హ‌నంతో ఉన్నారు. ప్ర‌స్తుత వ‌ర‌ద‌ల‌కు కార‌ణం జ‌గ‌నేన‌ని.. గ‌త ప్ర‌భుత్వం చేసిన త‌ప్పుల వ‌ల్లే బాధితుల‌కు ఈ క‌ష్టం వ‌చ్చింద‌ని చెబుతున్నారు.

అయితే.. ఈ విష‌యంపైనా భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వ‌ర‌ద‌లు రావ‌డానికి  రెండు రోజుల ముందే కేంద్రం అప్ర‌మ‌త్తం చేసింది. అయినా.. అధికారులు పెద్ద సీరియ‌స్‌గా తీసుకోలేదు. దీనికి కార‌ణం.. 31వ‌తారీకు పింఛ‌న్లు పంపిణీ చేయాల‌న్న చంద్ర‌బాబు ఆదేశాలేన‌ని వారు చెబుతున్నారు. దీంతోనే ప‌రిస్థితి చేయి దాటింద‌ని చెబుతున్నారు. త‌మ‌పై ఒత్తిళ్లు పెరుగుతుండ‌డంతో తాము వ‌ర‌ద‌ల‌పై దృష్టి పెట్ట‌లేక పోయామ‌ని అంటున్నారు. ఏతా వాతా ఎలా చూసినా ఇప్పుడు చంద్ర‌బాబు డిఫెన్స్‌లో ప‌డిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: