• ఖైరతాబాద్ గణేశుడు ఎప్పుడూ స్పెషలే
• ఆ గణపతి చేతిలో లడ్డూ మరింత స్పెషల్
( తెలంగాణ ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)
గణనాథుడి భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వినాయక చవితి రానే వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితిని చాలా ఘనంగా జరుపుతారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేశుడి గురించి ప్రపంచవ్యాప్తంగా తెలుసు. అంత పెద్దగా ఇక్కడ విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని నెలకొల్పుతారు. గణేషుడు చేతిలో ఉంచే లడ్డూ కూడా చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇది పెద్దగా ఉంటుంది. ఈ లడ్డూ విశేషాలు, ప్రత్యేకతలు తెలుసుకుందాం.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న తాపేశ్వరం అనే ఊరిలో గణేశుడి లడ్డూ తయారవుతుంది. ఈ లడ్డూను సురిచి అనే ఒక ఫుడ్ తయారీ సంస్థ తయారు చేస్తుంది. తాపేశ్వరం కాజాలను ఇన్వెంట్ చేసింది కూడా ఈ కంపెనీయే. ఒక్క ఖైరతాబాద్ గణపతి చేతిలోనే కాదు, పాపులర్ అయిన అన్ని విఘ్నేశ్వరుడి చేతుల్లో సురిచి ఫుడ్స్ సంస్థ తయారుచేసిన లడ్డూలే కనిపిస్తాయి. ఈ లడ్డూలో జీడిపప్పు, బాదంపప్పు బాగా మిక్స్ చేస్తారు. అలానే వినాయకుడి ప్రతిమ, గణనాథుడి తల్లిదండ్రులైన శివుడు పార్వతుల ప్రతిమలు లడ్డూకి అంటిస్తారు.
సురిచి సంస్థ 2010 నుంచి ఖైరతాబాద్ గణేషుడికి లడ్డూ సరఫరా చేయడం మొదలుపెట్టింది. సురిచి సంస్థ అధినేత మల్లిబాబు మొదటగా గణేష్ చేతిలో తినదగిన లడ్డూ పెట్టాలని ఒక ఆలోచన చేశారు. వాళ్ల కూతురు మట్టి లడ్డూ పెట్టడం ఎందుకు నాన్న? అని అడిగినప్పుడు ఆయనకు నిజమైన లడ్డూ పెట్టాలనే ఆలోచన వచ్చింది. తర్వాత ఖైరతాబాద్ గణనాథుడి నిర్వాహకులకు ఫోన్ చేసి అసలైన లడ్డూ ఉంచొచ్చు కదా అని అడిగారు. 100 కిలోల లడ్డూ పంపిస్తానని గణేశుని విగ్రహం చేతిలో ఉంచాలని కోరారు. అందుకు వారు అంగీకరించారు. అయితే 100 కిలోల లడ్డూ తయారు చేయాలనుకున్నా అది 600 కిలోలకు చేరుకుంది. అయినా సరే లడ్డూని అతి కష్టం మీద వినాయకుడు చేతిలో జాగ్రత్తగా ప్లేస్ చేశారు.
దీనికి ముందు వరకు మల్లిబాబుకు పెద్దగా వ్యాపారం ఉండకపోయేది. వినాయకుడి లడ్డూలు తయారు చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆయనకు తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలా ఆర్డర్స్ వచ్చేవి. అందువల్ల వీరి వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. ఈ సురిచి సంస్థ తాపేశ్వరం మెయిన్ రోడ్డు బృందావనం 12-190 అడ్రస్ లో ఉంటుంది.