బెజవాడ వరద బాధితులకు సాయంలో ' టీకేఆర్ ' ఫస్ట్
+ తమ ఇబ్బందులను కూడా మరిచి దాతృత్వం
+ సర్వత్రా అభినందనలు అందుకుంటున్న టీకేఆర్ వాసులు
విజయవాడ: ఎటు చూసినా వరద.. మోకాల్లోతుకాదు.. పీకల్లోతు నీరు. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. ఇళ్లు.. ఊళ్లూ.. కూడా మునిగిపోయిన దుస్థితి. ఇదీ.. విజయవాడ శివారు ప్రాంతాలైన పాయకాపురం, ప్రకాశ్‌నగర్, రాధానగర్, నున్న ఇన్నర్ రింగ్ రోడ్డులోని ప్రజల దారుణ పరిస్థితి. సాధారణ ఇళ్లే కాదు.. లక్షల రూపాయలు పోసి కొనుగోలు చేసుకున్న మధ్యతరగతి ప్రజల అపార్ట్‌మెంట్లు కూడా.. నీటమునిగిపోయిన దుస్థితి. ఈ దారుణ దుస్థితిలో తమను ఆదుకునే వారు ఎవరు? తమ ఆకలి బాధను తీర్చేదెవరని.. వరద బాధిత ప్రాంతాల ప్రజలు వెయ్యికళ్లతో ఎదురు చూశారు. కానీ, ఎటు చూసినా.. అందరూ బాధితులే! ఎవరిని కదిలించినా.. కన్నీటి వ్యథలే!!
ఇలాంటి దుర్భర సమయంలో.. చీకట్లో చిరుదివ్వెలా బాధితులను తన కడుపులో దాచుకుంది.. నున్న ఇన్నర్ రింగ్‌రోడ్డులోని టీకేఆర్ టవర్స్ అపార్ట్‌మెంట్. ఇక్కడ మొత్తం 90 ఫ్లాట్లు ఉండగా.. 70 కుటుంబాలకు పైగానే నివశిస్తున్నాయి. ఈ ఏరియాలోని అన్ని అపార్ట్‌మెంట్లు మునిగిపోయినా.. ఒక్క ఈ అపార్ట్‌మెంటు మాత్రమే సేఫ్‌గా నిలిచింది. దీంతో బాధితులు ఈ అపార్ట్‌మెంటునే ఆశ్రయించారు. వీరి ఆకలి కేకలు.. దాహార్తి చూసిన అపార్ట్‌మెంటులోని 70 కుటుంబాలు కదలిపోయాయి. ఇంటికో పువ్వు ఈశ్వరుడికొక మాల అన్న చందంగా అందరూ చేతులు కలిపారు. పప్పు ఇచ్చిన వారు కొందరు.. ఉప్పు ఇచ్చిన వారు మరికొందరు అన్నట్టుగా.. ప్రతి ఒక్కరూ బాధితులను ఆదుకునేందుకు ఇంట్లో తమ కోసం ఉంచుకున్న సరుకులు కూడా అందించి సాయానికి నడుం బిగించారు.
అపార్ట్‌మెంటు బిల్డర్ భీమవరపు వెంకట అప్పారెడ్డి, టీకేఆర్ టవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీర్ల చిన్ని.. కమిటీ సభ్యులు.. యద్దనపూడి రాజు, మోహనరావు, వెంకటేశ్వరరావు, యాదా నాగభూషణం, ఆయన సతీమణి రాజ్యలక్ష్మి, బాలు, హరికృష్ణ, వెంకట్.. ఇలా అందరూ తమ తమ కుటుంబాలను కూడా పక్కన పెట్టి .. అందరినీ కలుపుకొని మానవ సేవే మాధవ సేవ.. అన్నట్టుగా వరద బాధితులకు నిరంతరం ఆకలి తీర్చే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్నారు. అందరూ కలిసి కట్టుగా.. ముందుకు సాగి.. గత మూడు రోజులుగా అపార్ట్‌మెంటు ఎదుర్కొంటున్న విద్యుత్ కష్టాలను కూడా పక్కకు పెట్టి.. వరద బాధితుల క్షుద్భాద తీర్చేందుకు ముందుకు సాగారు.
ఎందరెందరికో..
వరద ప్రభావిత ప్రాంతాలతో పోల్చితే.. ఇన్నర్ రింగ్ రోడ్డు ఒక్కటే సురక్షిత ప్రాంతంగా కనిపించింది. దీంతో వందల మంది ప్రయాణికులు, లారీల డ్రైవర్లు, క్లీనర్లు, ఇతర సిబ్బంది, చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇలా ఎందరెందరో.. ఈ రోడ్డునే ఆశ్రయించారు. అయితే.. వీరి ఆకలి, దాహం తీరే మార్గం కనిపించలేదు. ఇలాంటి క్లిష్ట సమయంలో వీరిని ఆదుకునేందుకు.. టీకేఆర్ టవర్స్ పొయ్యి వెలిగించి.. అప్పటికప్పుడు అల్పాహారం నుంచి మధ్యాహ్నం, రాత్రి భోజనాల వరకు వండి వార్చింది. వచ్చిన వారికి వచ్చినట్టు.. ఆకలి తీర్చింది. పదుల సంఖ్యలో మొదలైన బాధితుల ప్రవాహం.. వందలు.. వేలకు చేరింది. అయినా.. టీకేఆర్ కుటుంబాలు.. ఎక్కడా వెనుకడుగు వేయలేదు. లేదని చేతులు ఎత్తేయలేదు.. ప్రభుత్వ సాయానికి సరిసమానంగా ఇంకో మాటలో చెప్పాలంటే.. ఇంకా ఎక్కువగానే బాధితులను ఆదుకుంది.
300 కిలోల బియ్యం, వందల కిలోల కూరగాయలతో అప్పటికప్పుడు టీకేఆర్ టవర్స్ కుటుంబాలు.. స్వయంగా వండి వార్చాయి. 20 వేల లీటర్లకు పైగా శుద్ధమైన తాగునీటిని అందించాయి. ఈ మొత్తం.. కార్యక్రమాన్ని.. బిల్డర్ భీమవరపు అప్పారెడ్డి, కమిటీ ప్రెసిడెంట్ వీర్ల చిన్న ముందుండి నడిపించడం విశేషం. మిగిలిన కుటుంబాలన్నీ.. ఏకతాటిపై నిలిచి.. విపత్తు బాధుతులకు ఊరటనిచ్చేలా సహకరించడం గమనార్హం. ఈ విషయం తెలిసి.. టీకేఆర్ టవర్స్ కుటుంబాలకు.. సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. స్వయంగా అధికారులు, మంత్రులు కూడా కొనియాడడం గమనార్హం.
సర్కారుకు సాటి!
టీకేఆర్ టవర్స్ సమీపంలోని పాయకాపురం ప్రాంతంలో ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహంలో 70 మంది విద్యార్థినులు ఉంటున్నారు. అయితే.. ఆదివారం ఉదయాన్నే వెల్లువెత్తిన వరద.. ఈ వసతి గృహాన్ని ముంచేసింది. దీంతో తమను ఆదుకోవాలని హాస్టల్ వార్డెన్ సుజాత సర్కారుకు విన్నవించారు. కానీ, అప్పటికే భారీ ఎత్తున వరద వచ్చేయడంతో.. సాయం అందడంలో ఆలస్యమైంది. ఈ విషయం తెలిసిన.. ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి.. టీకేఆర్ టవర్స్ బిల్డర్ సహా కమిటీని సంప్రదించి.. విద్యార్థినులకు రక్షణ కల్పించాలని విన్నవించారు. దీంతో 70 మంది విద్యార్థినులకు టీకేఆర్ టవర్స్.. ఆశ్రయం కల్పించింది. రోజు రోజంతా.. భోజనాలు, అల్పాహారం అందించడంతోపాటు.. వారు బస చేసేందకు కూడా సౌకర్యాలు కల్పించింది.