జగన్ నమ్మకాన్ని వమ్ము చేసిన మోపిదేవి.. ఇద్దరి మధ్య గ్యాప్ కు అసలు కారణాలివే!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ ఎంపీ పదవికి మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడం ఒకింత సంచలనం అయిన సంగతి తెలిసిందే. త్వరలో తాను టీడీపీలో చేరతానని మోపిదేవి సంచలన ప్రకటన చేయడం జరిగింది. వైసీపీకి ఉమ్మడి గుంటూరు జిల్లాలో మోపిదేవి పెద్దదిక్కుగా వ్యవహరించడంతో పాటు జగన్ కు కుడి భుజంగా కూడా ఆయనకు పేరుంది.
 
జగన్ జైలులో ఉన్న సమయంలో తోటి ఖైదీగా ఉన్న మోపిదేవి ఆ సమయంలో జగన్ కు క్లోజ్ అయ్యారు. 2019 ఎన్నికల్లో మోపిదేవి ఎమ్మెల్యేగా గెలవకపోయినా జగన్ మాత్రం మోపిదేవికి మంత్రి పదవితో పాటు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. 2024 ఎన్నికల్లో మోపిదేవి పోటీ చేయాలని భావించినా టికెట్ దక్కలేదు. మోపిదేవి తన సోదరుడికైనా టికెట్ దక్కించుకోవాలని ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు సైతం సఫలం కాలేదు.
 
రేపల్లెలో గణేష్ అభ్యర్థిత్వం విషయంలో జగన్, మోపిదేవి మధ్య కొంత గ్యాప్ వచ్చిందనే ప్రచారం సైతం జరిగింది. తనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో మోపిదేవి మనస్తాపానికి గురై పార్టీకి, పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా పార్టీ వ్యవహరాలకు దూరంగా ఉంటూ వస్తున్న మోపిదేవి గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతున్న విధంగానే రాజీనామా చేశారు.
 
తాను ప్రలోభాలకు లోనయ్యానని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. కొంతమంది టీడీపీ పెద్దలతో తాను మాట్లాడానని ఆయన వెల్లడించారు. మోపిదేవి రాజీనామాతో రేపల్లె మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో పడే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. మోపిదేవి వెంకట రమణ తీసుకున్న నిర్ణయం వైసీపీ నేతలను కలవరపరుస్తోందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. జగన్ నమ్మకాన్ని మోపిదేవి వమ్ము చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో జగన్ మరిన్ని షాకులకు సిద్ధంగా ఉండాలని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుండటం కొసమెరుపు. తనకు ఎదురవుతున్న ఇబ్బందులను జగన్ ఎలా అధిగమిస్తారో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: