ఏపీ: అలా చేయొద్దని చంద్రబాబును రిక్వెస్ట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే..!

FARMANULLA SHAIK
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక విపక్ష వైసీపీ నుంచి వలసలు పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే ఇద్దరు వైసీపీ రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఓ ఎమ్మెల్సీ కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వీరంతా టీడీపీలో లేదా కూటమి పార్టీల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కూటమి పార్టీల నుంచి హామీ లభించాకే వీరు వైసీపీకి రాజీనామాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి రాకపై టీడీపీలో అప్పుడే అసంతృప్తులు మొదలయ్యాయి.వైసీపీ నేతల చేరికలపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పలువురు వైసీపీ నేతలు ఇప్పటికే పార్టీ మారారు. మరికొందరు కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్సీ పోతుల సునీత అధికార పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు భిన్నంగా స్పందిస్తున్నారు. కూటమిలోకి వచ్చే వారికి ఆహ్వానం పలుకుతామని శ్రీకుకాళం ఎంపీ, కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు చెప్పగా.. వైసీపీ నాయకులను తీసుకోవద్దని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అధిష్టానాన్ని కోరారు.ఇవాళ వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పోతుల సునీత టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష స్పందించారు. దయచేసి ఇలాంటి ఊసరవెల్లి లాంటి నాయకుల్ని మన పార్టీలో తీసుకోవద్దని ఆమె పార్టీ పెద్దల్ని కోరారు. అధికారం కోసం వచ్చే ఇలాంటి వాళ్ళకి పార్టీలో తీసుకుంటే, అధికారం లేనప్పుడు మన పార్టీ కోసం నిజాయితీగా పోరాడిన వాళ్ళని అవమానించినట్టే అంటూ ఓ పోస్ట్ పెట్టారు.గతంలో టీడీపీలో ఎమ్మెల్సీ పదవి అనుభవించి వైసీపీలోకి ఫిరాయించిన పోతుల సునీత.. తిరిగి ఇప్పుడు టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె రాకపై టీడీపీలో నేతలు భగ్గుమంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ వైసీపీకి పోతుల సునీత రాజీనామా సమర్పించారు. ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకుని టీడీపీలో ఆమె చేరతారా లేక అలాగే వచ్చేస్తారా అనేది చూడాల్సి ఉంది.అధికారం కోసం వచ్చే ఇలాంటి వాళ్లని పార్టీలో తీసుకుంటే, అధికారం లేనప్పుడు మన పార్టీ కోసం నిజాయితీగా పోరాడిన వాళ్లని అవమానించినట్టేనని ఆమె అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: