కేసీఆర్:పార్టీలు మారిన పవర్ తగ్గలే..మంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు.!
- పార్టీలు మారిన పదవులు దక్కాయి.
- టిడిపిలో మంత్రి టిఆర్ఎస్ లో ముఖ్యమంత్రి.
- అలుపెరుగని పోరాటం కేసీఆర్ సొంతం.
విద్యార్థి ఉద్యమాల నుంచి మొదలై ప్రత్యేక తెలంగాణను సాధించి సీఎం పీఠం ఎక్కే వరకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అలుపెరుగని పోరాటం చేశారని చెప్పవచ్చు. ఆయన రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ తట్టుకొని తిరుగులేని శక్తిగా నిలిచారు. పార్టీలు మారిన పవర్ తగ్గించుకోకుండా, తన శక్తి ఎంతో నిరూపించుకుంటూ చివరికి సొంత పార్టీ పెట్టి ఆ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేలా చేసిన ఘనుడు కేసీఆర్ అని చెప్పవచ్చు. అలాంటి కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది. పార్టీలు మారిన ఆయన పవర్ ఎందుకు తగ్గలేదు ఆ వివరాలు చూద్దాం.
పోరాట వీరుడు కేసీఆర్:
తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటివరకు 8సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఐదుసార్లు ఎంపీగా గెలిచి రికార్డు సాధించారు. ఉమ్మడి మెదక్ జిల్లా చింతమడకలో 1954 ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న కేసీఆర్, యువజన కాంగ్రెస్ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి 1983లో సిద్దిపేట నుంచి మొదటిసారి పోటీ చేసి ఓడిపోయారు. 1985 మధ్యంతర ఎన్నికల్లో సిద్దిపేట నుంచి గెలుపు సాధించారు. 1989, 1994, 1999, 2001 సంవత్సరాల్లో వరుస విజయాలు అందుకున్నాడు. అంతేకాకుండా 1997లో ఉమ్మడి రాష్ట్రంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1999లో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, టిఆర్ఎస్ పార్టీని స్థాపించి 2001లో సిద్దిపేట నుంచి పోటీ చేసి విజయం సాధించారు.