ఆ యువనేతల గాండ్రింపు ఎక్కడ ? జగన్ ను ఒంటరి చేసారుగా..?
* వైసీపీ యువ నేతలంతా ఏరి.. ఎక్కడికి పోయారు..?
* ఎన్నికలకు ముందు పదునైన మాటలతో విరుచుకు పడ్డ ఆ నేతలు సైలెంట్ అవ్వడానికి కారణం అదేనా..?
* వైసీపీ ఫైర్ బ్రాండ్స్ సైతం నోరు మెదపని పరిస్థితి..
* జగన్ ఒంటరి పోరాటం ఎంతవరకు సక్సెస్ అవుతుందో..?
2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ ఏకంగా 151 సీట్లు సాధించి చరిత్ర సృష్టించింది.. ఆ సమయంలో పాదయాత్ర చేసిన జగన్ ప్రతి ఇంటికి తిరిగి వారి కష్టాలను తెలుసుకున్నారు.. ఒక్క అవకాశం ఇవ్వండి మీ బిడ్డ మంచి చేసి చూపిస్తాడు అని ప్రతి ఇంటికి తిరిగి జగన్ మాట ఇచ్చాడు.. నవరత్నాల పధకాలతో జగన్ జనాలను బాగా ఆకర్షించాడు.అప్పటికే బాబు పాలనలో విసిగిపోయిన ప్రజలు జగన్ కు ఒక్క ఛాన్స్ ఇద్దామని ఏకంగా చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించారు. జగన్ సీఎం గా వున్న గత ఐదేళ్లు జనాలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పధకాలను అందిస్తూ వచ్చారు. గ్రామ వాలంటీర్, గ్రామ సచివాలయం వంటి సమాంతర వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతి పధకం ప్రజలకు చేరువయ్యేలా చేసారు.. అయితే జగన్ పాలనలో ప్రజలకు మంచి ఎంతైతే జరిగిందో నష్టాలు కూడా ఎక్కువగానే జరిగాయని చెప్పాలి.. జగన్ హామీ ఇచ్చిన సంపూర్ణ మద్యపాన నిషేధం, సీపీఎస్ రద్దు, జాబ్ క్యాలెండరు వంటి హామీలు అమలు చేయకపోవడం వైసీపీకి ప్రజలలో వ్యతిరేకత మొదలైంది.. అంతే కాకుండా సామాన్యుడికి బాగా మండేలా చేసిన మరొక అంశం పెరిగిన నిత్యావసర ధరలు.. చంద్రబాబు హయాంలో నార్మల్ గా వుండే ధరలు జగన్ వచ్చాక ఇంతలా పెరగడం మమ్మల్ని తీవ్ర ఇబ్బందికి గురి చేస్తుందని చాలా మంది తెలిపారు..
అయితే వైసీపీ నాయకులు ఓడిపోయిన టీడీపీని గత ఐదేళ్లుగా ఒక ఆట ఆడుకున్నారు.. అసెంబ్లీ లో అధిక సంఖ్యా బలంతో వున్న వైసీపీ టీడీపీ నాయకులను పదునైన మాటలతో తీవ్రంగా విమర్శించారు. వైసీపీ లో అనిల్ కుమార్ యాదవ్,మార్గాని భరత్, మిథున్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, బైరెడ్డి సిద్దార్థరెడ్డి వంటి యువ నాయకులు గత ఐదేళ్లలో వైసీపీ పార్టీలో తమ పదునైన మాటలతో ప్రతి పక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు.. వీరి ఉత్సాహం చూసి జగన్ పార్టీలో యువ నాయకులకు ఎక్కువ అవకాశం ఇచ్చారు. 2024 ఎన్నికలలో భాగంగా పవన్ కళ్యాణ్, టీడీపీ, బీజేపీ కలిసి కూటమిగా మారి బలపడ్డారు.. ఆ కూటమిని తిప్పి కొట్టేందుకు జగన్ వేసిన పధకాలు అన్ని ఇన్ని కావు. సిద్ధం సభలతో సరికొత్తగా ప్రచారం చేసి చూపించారు. ఆ ప్రచార సభలలో వైసీపీ యువ నాయకులు, ఫైర్ బ్రాండ్స్ అయిన రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు తమ పదునైన మాటలతో జనాలను ఆకర్షించే ప్రయత్నం చేసారు..
అయితే ఇటీవల జరిగిన ఎన్నికలలో వచ్చిన ఫలితాలు చూసి వైసీపీ పార్టీ అధినేత జగన్ కు, నేతలకు, కార్యకర్తలకు దిమ్మ తిరిగిపోయింది. కూటమి ఏకంగా 164 సీట్లు సాధించింది. వైసీపీ కేవలం 11 సీట్లు మాత్రమే సాధించి ప్రతి పక్ష హోదా కోల్పోయింది..అనుకున్నట్లు గానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి బాధ్యతలు స్వీకరించారు.. వైసీపీ హయాంలో టీడీపీ ని వేధించిన ప్రతి ఒక్కరి పేరు లోకేష్ రెడ్ బుక్ లో నోట్ చేసుకోవడం జరిగింది.. టీడీపీ వచ్చిన రెండు నెలలకే హత్య రాజకీయాలు ఎక్కువయ్యాయి అని వైసీపీ కార్యకర్తలపై విరుచుకుపడుతున్నారని జగన్ ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్ ఇలా వరుసగా ప్రయాణిస్తూ ప్రభుత్వం పై ఒంటరి పోరాటం చేస్తున్నారు. గత ఎన్నికల ప్రచారంలో పులిలా గాండ్రించిన యువ నాయకులు ఇప్పుడు కంటికి కనిపించకుండా పోయారు. జగన్ ఒక్కరే పార్టీని బలోపేతం చేసేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు..