బై బై పాలిటిక్స్ : తమ్ముడి అనూహ్య గెలుపుతో అన్న రాజకీయ జీవితానికే గండి పడిందిగా..!!
* ప్రత్యక్ష రాజకీయాలకు కేశినేని గుడ్ బై..
* తమ్ముడిపై ఘోర ఓటమినే కారణమా..?
* బెజవాడ పాలిటిక్స్ లో సంచలనంగా మారిన నాని నిర్ణయం..!!
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 2024 ఎన్నికలలో కూటమి సంచలన విజయం సాధించింది.. వైసీపీ కేవలం 11 సీట్లు మాత్రమే సాధించి ప్రతిపక్ష హోదా కోల్పోయింది..అయితే ఏకంగా పదేళ్లపాటు బెజవాడ ఎంపీగా పనిచేసిన కేశినేని నాని రాజకీయాలకు వీడ్కోలు చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున బెజవాడ ఎంపీగా నాని వరుస విజయాలు సాధించారు.2024 ఎన్నికల్లో మాత్రం వైసీపీ తరపున బరిలోకి దిగిన నాని తన సొంత సోదరుడు కేశినేని చిన్ని చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ పరాజయం నానికి నిద్రపట్టనివ్వకుండా చేసింది.తర్వాత తన కార్యకర్తలతో అనేక సమాలోచనలు జరిపి చివరికి రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. తన స్థానంలో కొత్తగా ఎన్నికైన వారు బెజవాడను పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేయాలని కోరుకున్నారు.తాను రాజకీయాలకు దూరంగా ఉన్నా కూడా బెజవాడ అభివృద్ధికి తన మద్ధతు ఎప్పుడూ ఉంటుందని నాని తెలిపారు.అలాగే తనకు రెండుసార్లు ఎంపీగా అవకాశం అందించిన బెజవాడ పార్లమెంట్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
అయితే ప్రత్యక్ష రాజకీయాలలో కేశినేని నాని పేరు సంచలనం అని చెప్పొచ్చు.2009 ఎన్నికల సమయంలో తొలుత కేశినేని నాని ప్రజారాజ్యంలో చేరారు.ఆ సమయంలో టికెట్ల కేటాయింపుతో పాటు ఆ పార్టీ ఇతర అంశాల విషయంలో చిరంజీవితో బాగా గ్యాప్ రావటంతో నాని ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 2014లో తొలిసారి బెజవాడ నుంచి టీడీపీ ఎంపీగా గెలిచారు. అదే సమయంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయినా కూడా టీడీపీలో కొందరు నేతల తీరు నానికి విసుగు తెప్పించింది.వారిపై కేశినేని నాని బహిరంగ విమర్శలు చేయటం.. అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.. 2019లో రెండోసారి టికెట్ సాధించిన కేశినేని నాని.. వైసీపీ జోరులో కూడా బెజవాడ నుంచి గెలిచారు. రెండోసారి గెలిచిన దగ్గర నుంచి కేశినేని నానికి టీడీపీ పార్టీ నేతలకు మధ్య రాజకీయ రచ్చ మొదలైంది. అప్పటి వరకు సఖ్యతగా ఉన్న కేశినేని నాని, బుద్ధా వెంకన్న, బోండా ఉమా, నాగుల్ మీరా మధ్య గొడవలు మొదలయ్యాయి.ఆ గొడవలు మున్సిపల్ ఎన్నికల నాటికి మరింత వేడెక్కాయి.కేశినేని నాని చంద్రబాబు, లోకేష్ లతో వ్యవహరించిన తీరుతో అధిష్టానం కూడా కేశినేని నానిపై సీరియస్ అయింది.చంద్రబాబుకు బొకే ఇచ్చే సమయంలో దానిని నెట్టేయటం వంటి వీడియోలు బాగా వైరల్ గా మారటంతో పార్టీలో కేశినేని ఇమడలేకపోయారు.
ఇదే సమయంలో టీడీపీ అధిష్టానం కేశినేని నానికి ప్రత్యామ్నాయంగా ఆయన సొంత సోదరుడు కేశినేని చిన్నిని రంగంలోకి దింపింది. నాని పార్టీలో ఉండగానే చిన్నికి పార్లమెంట్ పరిధిలో అధిక ప్రాధాన్యత ఇచ్చింది. పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల సమన్వయ కర్తలు కూడా నానికి దూరంగా ఉంటూ చిన్నితో కార్యకలాపాలు నిర్వహించేవారు. దీనితో అగ్రహించిన నాని.. వైసీపీ ఎమ్మెల్యేలకు నిధులు ఇచ్చి వారితోపాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనటం వంటి పనులు చేసారు.దీనితో టీడీపీ అధిష్టానం బెజవాడ పూర్తి భాద్యతలు చిన్నికి అప్పగించింది.. దీనితో రగిలిపోయిన నాని టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయనతోపాటు ఆయన కుమార్తె శ్వేత కూడా పార్టీకి రాజీనామా చేసింది. ఆ తర్వాత 2023 చివర్లో కేశినేని నాని వైసీపీలో చేరి ఎంపీ టికెట్ సాధించారు.ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు, టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తనపై పోటీకి దిగిన సోదరుడు కేశినేని చిన్నిపై కూడా తీవ్ర ఆరోపణలు చేసారు.తీరా ఎలక్షన్ ముగిసి ఫలితం వచ్చాక చూసుకుంటే కేశినేని నానికి పెద్ద షాక్ తగిలింది. తన సోదరుడు చిన్ని గెలవడంతో తట్టుకోలేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు..