పవన్ జనసేనకు ఇదే ఫస్ట్ పరీక్ష... పవర్ చూపిస్తారా..?
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తోంది. అప్పుడే జనసేనకు తొలి అగ్నిపరీక్ష ఎదురుకానుంది.. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసిపి ఇప్పటికే తన అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరు ఖరారు చేసింది. బలమైన సామాజిక వర్గం తో పాటు ఆర్థికంగా బలంగా ఉండడంతో పాటు గ్రూపు రాజకీయాలను సైతం మేనేజ్ చేయగలే సామర్థ్యం సత్యనారాయణ సొంతం. ఈ క్రమంలో నే ఆయనని ఎంపిక చేయటం రాజకీయంగా తమకు కలిసి వస్తుందని వైసిపి అంచనా వేస్తోంది. పైగా బొత్స కు స్థానికంగా పలుకుబడి కూడా ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఆయన కుటుంబం మొత్తం ఓడిపోవడం కూడా సానుభూతి కానుంది. ఇక విశాఖ ఎంపీగా బొత్స సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మి పోటీ చేసి ఓడిపోయారు.
అసలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రావడానికి కారణమైన జనసేన ఇప్పుడు ఏం చేస్తుంది ? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. గతంలో వైసిపి ఎమ్మెల్సీ గా ఉన్న వంశీకృష్ణ యాదవ్ జనసేనలోకి వెళ్లి విశాఖ దక్షిణ నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సుమారు మూడు సంవత్సరాల పాటు ఈ ఎమ్మెల్సీ పదవీకాలం ఉంది. అయితే జనసేన పార్టీ ఈ సీటును తమకు ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. విశాఖలో బలం పెంచుకోవాలంటే ఇదే తమకు మంచి అవకాశం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే టిడిపి నేతలు కూడా ఈ ఎమ్మెల్సీ సీటు తమకు కేటాయించాలని పట్టుబడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ తన పవర్ చూపించి ఈ ఎమ్మెల్సీ సీటును తాను తీసుకుని గెలిపించు కుంటే ... జనసేన ఖాతలో రెండో ఎమ్మెల్సీ పడినట్టు అవుతోంది. మరి పవన్ పవర్ ఈ విషయంలో ఎంతవరకు పని చేస్తుందో చూడాలి.