ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం హామీల అమలులో దూకుడు పెంచింది. ఎన్నికల ప్రచారంలో ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి మహిళకు ప్రతి నెల రూ. 1500, ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి రైతుకు ఏటా రూ. 20 వేలు, ప్రతి స్కూలుకు వెళ్లే విద్యార్థికి రూ. 15 వేలు, యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు వంటి సూపర్ సిక్స్ హామీలు హామీలు ఇచ్చింది. అధికారంలోకి రెండు నెలలు కావడంతో పాలనపై పూర్తిగా దృష్టిసారించింది. ఎన్నికల హామీలపై కసరత్తులు ప్రారంభించింది. త్వరలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.కొంచెం లేటైయినా.. మహిళలకి ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు విషయంపై పూర్తి అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. దీనిపై పొరుగు రాష్ట్రాల నుంచి సూచనలు తీసుకుని అమలు చేస్తామన్నారు. అలాగే ఆ పథకం అమలులో వచ్చే లోపాలను అధిగమిస్తూ.. వాటిని సరిదిద్ది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పథకాన్ని కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. ఆర్టీసీ ప్రక్షాళన సైతం జరుగుతుందని, రాబోయే కాలంలో ఎలక్ట్రికల్ బస్సులు నడిపేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.త్వరలోనే దీనిపై మహిళలకు శుభవార్త చెప్తామన్నారు. చిత్తూరు ఆర్టీసీ డిపోలో 17 కొత్త బస్సుల్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. కర్ణాటకలో మహిళలకు స్మార్ట్ కార్డులు జారీచేయగా.. తెలంగాణలో మాత్రం జీరో టికెట్ల విధానం అనుసరిస్తున్నారు. అలాగే గుర్తింపు కార్డులు చూసి జీరోటికెట్లు ఇస్తున్నారు. ఈ టికెట్ల ఆధారంగా ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లింపులు జరుపుతోంది. అయితే తెలంగాణలో మాదిరిగా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎక్స్ ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో ఈ పథకాన్ని అమలుచేస్తారా... లేదా జిల్లాల లోపలి సర్వీసులకు మాత్రమే అమలు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.గత ఐదేళ్లలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వీర్యమైందని, కానీ చంద్రబాబు సీఎం అయ్యాక సుమారు 1400 బస్సులు ఏపీఎస్ఆర్టీసీ పరిధిలోకి వచ్చాయని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సుమారు 400 బస్సులు రోడ్ల మీదికి వచ్చాయన్నారు. ఏ ఉద్దేశ్యంతో ఏపీఎస్ఆర్టీసీని స్థాపించారో దాన్ని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.