రేవంత్ రెడ్డి హ్యాండ్ ఇచ్చిన నర్సంపేట ఎమ్మెల్యే...తాళం వేసి మరీ?

Veldandi Saikiran

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డికి కొత్త తలనొప్పి మొదలైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లోని క్యాంప్ కార్యాలయాలను స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు కుటుంబ సమేతంగా అందులో నివాసం ఉంటుంటే..... మరికొందరు అందులో అధికారిక కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.
కానీ వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాత్రం ఇప్పటివరకు క్యాంప్ ఆఫీసులోకి అడుగుపెట్టలేదు. ఆ కార్యాలయంలో ఉండేందుకు విముఖత చూపిస్తున్నారు దొంతి మాధవరెడ్డి. గెలిచిన తర్వాత ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా అందులో అడుగు పెట్టకపోవడంతో క్యాంపు కార్యాలయానికి తాళం వేలాడుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఫలితాలు వెల్లడైన రోజు రాత్రి నర్సంపేట క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయాడు.
ప్రస్తుతం అతను తన నివాసంలోనే ఉంటున్నారు. నర్సంపేట నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన దొంతి మాధవరెడ్డి మాత్రం క్యాంపు కార్యాలయం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఈ మధ్య దొంతి మాధవరెడ్డి ఏం చేసినా సంచలనమే అవుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా జనంలో చర్చకు దారితీస్తోంది. ఎమ్మెల్యే ఇప్పటివరకు క్యాంప్ కార్యాలయంలో అడుగు పెట్టడకపోవడంతో ఆర్ అండ్ బి అధికారులు క్యాంపు కార్యాలయానికి తాళం వేశారు.
నర్సంపేట బస్టాండ్ సమీపంలో ఉన్న పాత ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కి రంగులు వేసి దానిని అతని క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు ఎమ్మెల్యే మాధవరెడ్డి. అక్కడినుంచి పాలన వ్యవహారాలు చక్కబెడుతున్నారు. పాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఆర్ అండ్ బి అతిథి గృహంగా మార్చబోతున్నారు. క్యాంపు కార్యాలయం అందుబాటులో ఉన్న మాధవరెడ్డి మాత్రం అందులో అడుగుపెట్టకపోవడం వెనుక అసలు రహస్యం వాస్తు దోషమే అనే చర్చ జరుగుతోంది. వాస్తు నిపుణుల సూచనలతోనే ఆయన క్యాంప్ ఆఫీస్ గడప తోక్కలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: