నీటి తిప్పలు : సీమకు వరం.. రాయలసీమ ఎత్తిపోతల.. !
- శ్రీశైలంలో తగ్గిపోతోన్న వరద నీరు.. ప్రాజెక్టు కష్టమే
- న్యాయ వివాదాలతో అటకెక్కిన ప్రాజెక్ట్
( రాయలసీమ - ఇండియా హెరాల్డ్ )
కరువు సీమగా పేరొందిన నాలుగు జిల్లాలు.. చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల రైతులు, ప్రజలకు నీటి కష్టాలు తీర్చే ఎన్నదగిన ప్రాజెక్టు.. రాయలసీమ ఎత్తిపోతల పథకం. తొలిదశలో సీమలోని తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీరు అందించాలన్నది సర్కారు సంకల్పం. ఆరు పంపులను (ఒక్కొక్కటి 2,913 క్యూసెక్కుల సామర్థ్యం) ఏర్పాటుచేసి.. నీటి సమస్య తీవ్రంగా ఉండేప్రాంతాలకు నీటిని తరలించా న్నది ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్టును జగన్ సర్కారే డిజైన్ చేసింది.
అయితే.. దీనిపై తెలంగాణ సర్కారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి కారణం.. శ్రీశైలంలో 880 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నీరునిల్వ ఉన్నప్పుడు.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44 వేల క్యూసెక్కుల నీటిని సీమ ఎత్తిపోతలకు తరలిస్తారు. దీనిని కేసీఆర్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. సముద్రంలోకి పోయినా.. ఫర్వాలేదు.. అన్నట్టుగా వ్యవహరించింది. అయినా.. జగన్ మాత్రం దీనికోసం పట్టుబట్టారు. మీరు కాళేశ్వరం కట్టుకున్నారు మేం ప్రశ్నించామా అని కూడా నిలదీశారు.
ఇక, ఈ సీమ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19, తెలుగుగంగకు 29, గాలేరు–నగరికి 38 వెరసి 101 టీఎంసీలు సరఫరా చేస్తారు. వర్షాభావ పరిస్థితులవల్ల శ్రీశైలానికి వరద వచ్చే రోజులు ఏయేటికాయేడు తగ్గుతున్నాయి. మరోవైపు.. తెలంగాణ సర్కార్ 800 అడుగుల నుంచే నీటిని తోడేస్తుండటంతో శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి మట్టం తగ్గిపోతోంది. దీంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు నీళ్లందడంలేదు. దీనిని కట్టడి చేసేందుకు సీమ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది.
రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలను శ్రీశైలం నుంచి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. దీనికి అనుమతులు రాలేదు. అయినప్ప టికీ.. శ్రీశైలం రిజర్వాయర్ జలవిస్తరణ ప్రాంతంలో సంగమేశ్వరం వద్ద 800 అడుగుల నుంచే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి సిద్ధమైంది. కానీ, దీనికి న్యాయ పరమైన చిక్కులు వచ్చాయి. దీంతో ఇది ఆగిపోయింది. ఇప్పుడు చంద్రబాబు ఈ ప్రాజెక్టును ఏం చేస్తారో చూడాలి.