అమ్మ‌కు వంద‌నం ఎప్పుడు బాబూ..!

RAMAKRISHNA S.S.
ఎన్నికల హామీలు మిగిలే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు చెప్పిన ఎన్నికల హామీల్లో కీలకమైంది అమ్మకు వందనం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మంది పిల్లలకు 15 వేల రూపాయలు చొప్పున ఇస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రచారం చేశారు. అదేవిధంగా పింఛన్లను వెయ్యి రూపాయలు పెంచి ఇస్తామని హామీ ఇచ్చారు. దీన్ని ఈనెల ఒకటో తారీఖున అమలు కూడా చేశారు. అయితే ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న  కీలక పథకం అమ్మకు వందనం.

ఒకవైపు పాఠశాలలు తెరిచారు. పిల్లలను స్కూళ్లలో చేర్పించారు. దీంతో మధ్యతరగతి వర్గాలు ముఖ్యంగా దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రతి ఇంట్లో ఇద్దరి నుంచి ముగ్గురు పిల్లలు వరకు ఉన్నారు. చంద్రబాబు ఇచ్చిన  హామీ ప్రకారం ఎంతమంది పిల్లలు ఉన్నా స్కూలుకు వెళ్తే చాలు 15 వేల రూపాయలు చొప్పున  అందిస్తామని ఆయన చెప్పారు. ఇప్పుడు ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన అయితే రాలేదు.

ఈ నేపథ్యంలో అసలు ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారు? ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తుంది ? తమ పిల్లలకు ఎప్పుడు ఇస్తారు?  అని దిగువ మ‌ధ్య త‌రగతి కుటుంబాలతో పాటు పేద వర్గాలు కూడా ఎదురుచూస్తున్నాయి. వైసిపి హయంలో మొదట్లో జనవరి నెలలో అమలు చేసిన ఈ పథకాన్ని తర్వాత కాలంలో జూన్ కు మార్చారు. జనవరిలో ఇచ్చిన సంవత్సరంలో సంక్రాంతి పండుగకు ప్రజలు ఆ డబ్బును ఖర్చు పెట్టేసారని నివేదికలు అందాయి. దీంతో  విద్యా సంవత్సరం వచ్చేటప్పటికి మళ్ళీ తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని గుర్తించిన జగన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని జనవరి నుంచి జూన్ కు షిఫ్ట్ చేశారు.

తద్వారా పాఠశాలలు తెరిచే సమయానికి తల్లిదండ్రులు ఖాతాల్లో రూ. 15000 చొప్పున ఆయన జమ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు జూన్ వెళ్లిపోయింది జులై 10 రోజులు గడిచిపోయింది.  అయినా ప్రభుత్వం వైపు నుంచి ఈ పథకానికి సంబంధించి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఈ పథకం ఉంటుందా?  ఎప్పుడు ప్రకటిస్తారు? అనేది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  కొందరు అమలు చేయలేరని, మరికొందరు ఇంకా టైం పడుతుందని రకరకాల వాదనలు వినిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అసలు ఈ పథకాన్ని ఎప్పుడు అమ‌లు చేస్తారు? ఎప్పటి నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది? విధివిధానాలు ఏమిటి? అనే విషయాలను ఎంత వేగంగా ప్రకటిస్తే అంత మంచిది అనే  అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఒకవేళ ఈ పథకాన్ని ఇవ్వడంలో విఫలమైతే విపక్షానికి ఆయుధాలు అందించినట్టు అవుతుంద‌ని అంటున్నారు. ప్ర‌తిప‌క్షం బలంగా లేదని భావించవచ్చు. 11 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తారని అనుకోవచ్చు. కానీ ప్రజల్లో కనుక ఈ పథకం ఇవ్వలేకపోతున్నారు అనే చ‌ర్చ బ‌లోపేత‌మైతే మున్ముందు ఇతర పథకాల పైనా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది.

కాబట్టి ఈ పథకం పై సాధ్యమైనంత వేగంగా ప్రభుత్వం దృష్టి పెట్టి వివిధ విధానాలను ప్రకటించడం ద్వారా ఎప్పటినుంచి ఇస్తారని విషయాన్ని చెప్పడం ద్వారా ప్రజల్లో నెలకొన్న ఈ అసంతృప్తిని తొలగించేందుకు ప్ర‌య‌త్నించాలి. ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నం చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: